ముగిసిన నామినేషన్లు 

Telangana Panchayat Election Nominations First Phase Nizamabad - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : సర్పంచ్‌ స్థానాలకు అధికార పార్టీలోనే తీవ్ర పోటీ నెలకొంది. ఆయా గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ నేతలు ముగ్గురు, నలుగురు బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపుతుండటంతో నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు అంతగా జోక్యం చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో అవసరమున్న గ్రామాల్లో మండల స్థాయి నాయకులే సమన్వయ పరుస్తున్నారు. మండలంలో రెండు, మూడు గ్రామ పంచాయతీలు మినహా మిగిలిన అన్ని చోట్లా పోటీ నెలకొనే అవకాశాలున్నాయి. చిన్న గ్రామ పంచాయతీల్లోనే ఏకగ్రీవానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు గ్రామ పంచాయతీ ఎన్నికలపై దాదాపు చేతులెత్తేశారు. నియోజకవర్గాల్లో ఆ పార్టీల ఇన్‌చార్జులు పంచాయతీ ఎన్నికల జోలికే వెళ్లడం లేదు.

చివరి రోజు.. 
జిల్లాలో తొలి విడతలో ఆర్మూర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 177 గ్రామ పంచా యతీల సర్పంచ్‌ స్థానాలకు, వీటి పరిధిలోని 1,746 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. సోమవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు గడువు బుధవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. చివరి రోజు నామినేషన్లు వేసేందుకు అధిక సంఖ్యలో తరలిరావడంతో నామినేషన్లు స్వీకరించే స్టేజ్‌–1 రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల వద్ద హడావుడి నెలకొంది. నామినేషన్ల స్వీకరణకు గడువు ముగిసేలోగా 177 సర్పంచ్‌ స్థానాలకు 1,155 నామినేషన్లు, 1,746 వార్డు సభ్యుల స్థానాలకు 4,205 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు ప్రకటించారు. 

బైండోవర్లతో రహస్యంగా..? 
సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు వేలం పాటలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలుంటాయని జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసుశాఖ సైతం హెచ్చరించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇటీవల వేల్పూర్‌ మండలం అంక్సాపూర్‌ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను పోలీసులు బైండోవర్‌ చేశారు. దీంతో ఒకటీ, రెండు గ్రామాల్లో రహస్యంగా వేలం పాటలు జరిగాయనే ఊహాగానాలు వినిపించాయి. అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పుకొస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top