84.93 శాతం పోలింగ్‌

Telangana Panchayat 84.93 Percentage Polling In Nizamabad - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్‌ శుక్రవారం బోధన్‌ డివిజన్‌లోని ఆరు మండలాల పరిధిలో పూర్తయింది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరిగింది. అనంతరం అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. ఉదయం  పలుచోట్ల చిరు జల్లులు కురవడంతో ప్రారంభంలో పోలింగ్‌ ప్రక్రియ కాస్త మందకొడిగా సాగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఓటర్ల రాక పెరగడంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద సందడి షురువై వేగం పుంజుకుంది. రెండు గంటల్లోనే దాదాపు 40 శాతం పోలింగ్‌ పెరగడం గమనార్హం. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పోలింగ్‌ కేంద్రాలన్నీ దాదాపు వెలవెల బోయాయి. పోలింగ్‌ ముగిసే సమయానికి 84.93 శాతం నమోదైంది.
 
పోలింగ్‌ పరిశీలించిన కలెక్టర్‌ 
పోలింగ్‌ సరళిని జిల్లా కలెక్టర్‌ ఎం రామ్మోహన్‌ రావు పరిశీలించారు. బోధన్, ఎడపల్లి, రెంజల్‌ తదితర మండలా ల్లోని పలు గ్రామాల్లో జరుగుతున్న పో లింగ్‌ కేంద్రాలను ఆయన సందర్శించా రు. కౌంటింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకు అవసరమైన ఏర్పా ట్లు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఉప సర్పంచ్‌ల ఎన్నిక ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. రెంజల్‌ మండలం కూనేపల్లి, వీరన్నగుట్ట పోలింగ్‌ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య సందర్శించారు. సీపీ కార్తికేయ కూడా పలు పోలింగ్‌ కేంద్రాల్లో బందోబస్తును పరిశీలించారు.
  
తొలి విడత కంటే అధికంగా.. 
తొలి విడత ఆర్మూర్‌ రెవెన్యూ డివిజన్‌లోని 141 జీపీలకు జరిగిన పోలింగ్‌ 78.56 శాతం కాగా,  రెండో విడతలో పోలింగ్‌ శాతం కాస్త పెరిగింది. సుమారు 6.37 శాతం అధికంగా పోలింగ్‌ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్‌ నియోజకవర్గంలో 68.23 శాతం పోలింగ్‌ నమోదైంది. అలాగే బాన్సువాడ నియోజకవర్గంలో 83.66 శాతం పోలింగ్‌ జరిగింది. కానీ ఈ పంచాయతీ ఎన్నికల విషయాని కి వచ్చే సరికి 84.93 శాతానికి పెరగడం గమనా ర్హం.

పంచాయతీల పరిధి చిన్నగా ఉండటంతో అభ్యర్థులు తమ విజయం కోసం ఓటర్లను కేంద్రాలకు రప్పించేందు కు ప్రత్యేక ఆసక్తి చూపారు. ఓటర్లందరిని భాగస్వామ్యం చేసేందుకు అధికార యం త్రాంగం చేపట్టిన చర్యలు పోలింగ్‌ శాతం పెరగడానికి దోహదం చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జల్లపల్లికి మూడో విడతలో.. 
కోటగిరి మండలం జల్లపల్లిలో పోలింగ్‌ ప్రక్రియ నిలిచిపోయింది. సర్పంచ్‌ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులో పొరపా ట్లు జరగడంతో అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు.సర్పంచ్‌తో పాటు, వార్డు సభ్యుల ఎన్నికలను కూడా నిలిపివేశారు. మూడో విడత నిజామాబాద్‌ డివిజన్‌లోని గ్రామ పంచాయతీలకు పోలింగ్‌ నిర్వహించే రోజున జల్లపల్లికి కూడా పోలింగ్‌ జరిపే అవకాశాలున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top