తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

Telangana Intermediate Exams Results Released - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణలో ఇంటర్మీడియెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కడియం  శ్రీహరి ఇంటర్‌ బోర్డు కార్యాలయ ఆవరణలో  ఉదయం 9 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 62.35 శాతం ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

యథావిధిగా ఈసారి కూడా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరిగినట్లు తెలిపారు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ దరఖాస్తుకు ఏప్రిల్ 20 వరకు గడువు విధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇకపై ప్రభుత్వ కళాశాలల్లో జేఈఈ, నీట్‌లకు ప్రత్యేక కోచింగ్‌ ఇవ్వనున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు.

ఫిబ్రవరి 28 నుంచి మార్చి 14వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,63,546 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4,55,635 మంది ఫస్టియర్‌ కాగా.. 5,07,911 మంది సెకండియర్‌ విద్యార్థులున్నారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 2,84,224 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే 4,29,378 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయగా, వీరిలో 2,88,772 మంది ఉత్తీర్ణులయ్యారు.

  • ఇంటర్ ఫస్టియర్లో 62.35 శాతం విద్యార్థులు ఉత్తర్ణత
  • ఫస్టియర్‌లో బాలికలు 69 శాతం, బాలురు 55.66 శాతం ఉత్తీర్ణత
  • ఫస్టియర్‌లో మేడ్చల్‌ జిల్లా ప్రథమ, రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది
     
  • ఇంటర్‌ సెకండియర్‌లో 67.25 శాతం ఉత్తీర్ణత
  • సెకండియర్‌లో బాలికలు 73.25, బాలురు 61 శాతం ఉత్తీర్ణత
  • ఫలితాల్లో  కొమరం భీం జిల్లా తొలి, రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానాల్లో నిలిచాయి
  • 40 శాతం ఉత్తీర్ణతతో మహబూబాబాద్‌ జిల్లా చివరి స్థానంలో నిలిచింది
     
  • ట్రైబల్‌ వెల్ఫేర్‌ విద్యార్థులు 87 శాతం ఉత్తీర్ణత
  • సాంఘిక సంక్షేమ కళాశాలల్లో 86 శాతం ఉత్తీర్ణత
  • ప్రభుత్వ కాలేజీల్లో 70 శాతం, ప్రైవేట్‌ కాలేజీల్లో 69 శాతం ఉత్తీర్ణత

‘టీఎస్‌బీఐఈ సర్వీసెస్‌’ మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు తమ కాలేజీల వారీ ఫలితాలను తమ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి   http://admi.tsbie.cgg.gov. in  వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

ఫలితాల కోసం
www.sakshieducation.com

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top