నిజామాబాద్‌ ఎన్నికలపై స్టే ఇవ్వలేం

Telangana high court refuses stay on Nizamabad elections - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: నిజామాబాద్‌ ఎన్నకలపై స్టే ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. తొలివిడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 11న నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి కూడా ఎన్నికలు  జరగనున్న నేపథ్యంలో తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. దీంతో నిజామాబాద్‌ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు తొలగింది. తదుపరి విచారణ న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది. 

కాగా  నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పోలింగ్‌ను వాయిదా వేయాలని, పేపర్‌ బ్యాలెట్‌ ద్వారా పోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ ఎన్నికల బరిలో నిలిచిన 16మంది రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. గుర్తుల కేటాయింపు ప్రక్రియ నిబంధనల మేరకు జరగలేదని, ప్రధాన పార్టీల అభ్యర్థులు మూడు నెలల నుంచి ప్రచారం నిర్వహించుకుంటున్నారని, తమకు ప్రచారం నిర్వహించుకునేందుకు సమయం లేకుండా పోయిందని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నిజామాబాద్‌ ఎన్నికకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

మరోవైపు  రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నిజామాబాద్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో 185మంది అభ్యర్థులు ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీ నేతలతో పాటు స్వతంత్రులు పెద్దసంఖ్యలో పోటీ చేయడంతో ఎం-3 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఈవీఎంల చెకింగ్‌, ర్యాండమైజేషన్‌ పూర్తి చేసిన ఎన్నికల అధికారులు...వాటిని ఆదివారమే అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించారు. అయితే అక్కడ నుంచి పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలను తరలించడమే అధికారులకు సవాల్‌గా మారింది. గత ఎన్నికల వేళ 200 వాహనాల్లో పోలింగ్‌ సామాగ్రిని తరలించగా, ఈసారి ఆ సంఖ్య రెట్టింపు కానుంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top