మళ్లీ.. మహా కార్పొరేషన్లు

Telangana Government Plans To Setting Up Two New Corporations In Hyderabad - Sakshi

తెరపైకి మరో రెండు నగర పాలక సంస్థలు

పాత ఎంసీహెచ్‌కుతోడు హైదరాబాద్‌ ఈస్ట్, వెస్ట్‌ కార్పొరేషన్లుగా ఔటర్‌

మున్సిపాలిటీలు అప్‌గ్రేడ్‌ రాష్ట్ర ప్రభుత్వ మదిలో నగర పునర్విభజన

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరం మరింతగా విస్తరించనుంది. నాలుగేళ్ల క్రితం వాయిదాపడ్డ కొత్త మున్సిపల్‌ కార్పొరేషన్ల ఏర్పాటు అంశం మళ్లీ తెరమీదకు వస్తోంది. ఈసారి ఔటర్‌ రింగురోడ్డు లోపలున్న ప్రాంతాలన్నింటితో కలిపి రెండు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు చేయాలన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. 2008కి ముందున్న హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎంసీహెచ్‌)ను పునరుద్ధరించి, కొత్తగా హైదరాబాద్‌ ఈస్ట్, హైదరాబాద్‌ వెస్ట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఔటర్‌ రింగురోడ్డు లోపలున్న ప్రాంతాలన్నింటిని ఇటీవలే మున్సిపాలిటీలుగా మార్చిన ప్రభుత్వం వాటన్నింటికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలను కార్పొరేషన్ల పరిధిలోకి తీసుకువచ్చే ఆలోచనతో ఉండటం వల్లే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

ముచ్చటగా మూడు కార్పొరేషన్లు 
రోజురోజుకూ విస్తరిస్తున్న శివారు ప్రాంతాలకు మెరుగైన పాలన అందించే లక్ష్యంగానే ఢిల్లీ, ముంబైలలో పలు కొత్త మున్సిపల్‌ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. నగర శివారులోని ఎనిమిది మున్సిపాలిటీలను హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. అయితే గడిచిన పన్నెండు సంవత్సరాల్లో జీహెచ్‌ఎంసీ జనాభా కోటి దాటడంతోపాటు శివారు పంచాయతీలన్నీ జనసాంద్రతతో కిటకిటలాడే పరిస్థితి నెలకొంది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా మార్చాలన్న ఆలోచన చేసినప్పటికీ సాకారం కాలేదు. ఇటీవలే పంచాయతీ నుండి మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ అయిన బోడుప్పల్, ఫిర్జాదిగూడ, పోచారం, మణికొండ, నార్సింగి, బండ్లగూడ, శంషాబాద్, తుక్కుగూడ, ఆదిబట్ల, తుర్కయంజాల్, పెద్దఅంబర్‌పేట, జిల్లెలగూడ, బడంగ్‌పేట, జల్‌పల్లి, జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగారం, నిజాంపేట, గుండ్లపోచంపల్లి, కొంపల్లి తదితర ప్రాంతాలన్నింటినీ ఇప్పుడు కొత్త కార్పొరేషన్ల పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.  

మూడు కమిషనరేట్లకు సమాంతరంగా...  
నగరాన్ని ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లుగా విభజించిన నేపథ్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్లను సైతం మూడుగా విభజించాలన్న అంశాన్ని సీనియర్‌ అధికారులు ప్రస్తావిస్తున్నారు. అయితే, హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లతో కూడిన పాత హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు హైదరాబాద్‌ ఈస్ట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్, మేడ్చల్, ఎల్బీనగర్‌ నియోజకవర్గాలను, హైదరాబాద్‌ వెస్ట్‌లో మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాలను చేర్చాలన్న ప్రతిపాదనలు అధికార యంత్రాంగం వద్ద ఇప్పటికే ఉన్నాయి.

జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం ఇప్పటికే 625 చ.కి.మీ. ఉండగా, ఔటర్‌ రింగురోడ్డు పరిధిలోని ప్రాంతాలన్నీ కలిపితే మరో 600 చ.కి.మీ. కానుంది. జనాభా సైతం కోటిన్నర దాటిపోనుంది. ఈ మేరకు యాభై లక్షల మంది జనాభా, 400 చ.కి.మీ.లకు ఒక్క మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు అంశం శాస్త్రీయంగా కూడా సరైనదేనని స్థానిక పరిపాలనలో విశేష అనుభవం ఉన్న అధికారులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ ముగియగానే కొత్త మున్సిపల్‌ యాక్ట్‌ అమలుతోపాటే కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు అంశంపై ప్రభుత్వం మరింత స్పష్టతనిచ్చే అవకాశం కనిపిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top