ఇన్ఫర్మేషన్‌ ఈకో సిస్టంలో తెలంగాణకు అగ్రస్థానం

Telangana Got Top Place In The Information Ecosystem - Sakshi

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడి

టెక్నాలజీ రంగంలో 2020 తెలంగాణకు అత్యంత ప్రాధాన్యం

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ అంతర్జాతీయ స్టార్టప్, ఇన్ఫర్మేషన్‌ ఈకో సిస్టంలో తెలంగాణకు అగ్రస్థానం లభించిందని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. టెక్నాలజీ రంగంలో 2020 తెలంగాణకు అత్యంత ప్రాధాన్యం కలిగిన సంవత్సరమని ఆయన పేర్కొన్నారు. ఇన్నోవేషన్‌ ద్వారా అనేక సవాళ్లకు సమాధానాలు లభిస్తాయని, తెలంగాణ స్టార్టప్‌ కంపెనీలు ఈ దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీ హబ్‌ నాలుగో వార్షికోత్సవ సంబరాల్లో సోమవారం ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీ హబ్‌ ఇన్నోవేషన్‌ రంగంలో తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని సాధించి పెట్టిందన్నారు. కేవలం రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుందని, గత నాలుగు సంవత్సరాల్లో సాధించిన ప్రగతి సంతృప్తికరంగా ఉందన్నారు. రానున్న సంవత్సరాల్లో మరిన్ని మైలురాళ్లను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ స్థాయి భాగస్వాములతో ఇన్నోవేషన్, స్టార్టప్‌ రంగంలో ముందుకు పోతున్నదన్నారు. ఇన్నోవేషన్‌ రంగంలో ముందు వరుసలో నిలవాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇన్నోవేషన్‌ రంగంలో ప్రగతి ద్వారా కేవలం కార్పొరేట్‌ సెక్టార్లోనే కాకుండా, పారిశ్రామిక రంగంలోనూ అనేక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ఈ దిశగా తెలంగాణలోని యువత, స్టార్టప్‌ కంపెనీలు పనిచేయాలని ఆయన కోరారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇతర ఎమర్జింగ్‌ టెక్నాలజీ రంగంలోనూ ముందు వరుసలో నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. 2020 సంవత్సరంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ టీ హబ్‌ 2, దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్‌ సెంటర్‌ టీ–వర్క్స్‌ని ప్రారంభించనున్నామని కేటీఆర్‌ పేర్కొన్నారు. పలు టెక్నాలజీ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, ఐటీ, ఐటీ అనుబంధ పరిశ్రమల ప్రతినిధులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top