అభివృద్ధి పథం...

Telangana Formation Day Celebrations Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ వల్లకొండ శోభరాణి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా జిల్లాకేంద్రంలోని పోలీసు పరేడ్‌ మైదానంలో ఆదివారం జరిగిన సంబరాల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్, జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ కృష్ణా, గోదావరి జలాలను వినియోగించుకోవడానికి అనువుగా ప్రాజెక్టుల నిర్మాణం గతంలో జరగలేదని, ఈ నీటి వాటాను సమర్థవంతంగా వినియోగించుకొని రాష్ట్రంలో కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం రూపురేఖలే మారిపోనున్నాయని పేర్కొన్నారు. గడిచిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రైతులకు మరోమారు రూ.లక్ష వరకు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని తెలిపారు. పంట కాలంలో పెట్టుబడి కోసం రైతులు ఎవరి వద్ద చేయి చాచకుండా ఉండేందుకు అందిస్తున్న రైతుబంధు పథకం, మరణించిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు అమలు చేస్తున్న రైతు బీమా పథకాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయని అన్నారు. రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు ఎకరానికి ఏడాదికి రెండు దఫాలుగా అందిస్తున్న రూ.8వేల మొత్తాన్ని రూ.10వేలకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు 6వేల కుటుంబాలకు రైతుబీమా పథకం కింద సహాయం అందించినట్లు తెలిపారు. మైక్రో ఇరిగేషన్, వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం భారీ సబ్సిడీలు అందిస్తుందన్నారు. సామాజిక పింఛన్లను రెట్టింపు చేస్తున్నట్లు వివరించారు. అన్నిరకాల పింఛన్లను రూ.2016కు పెంచుతున్నట్లు తెలిపారు. వికలాంగులకు ఇచ్చే పింఛన్లను రూ.3016కు పెంచడం జరిగిందని, వృద్ధాప్య పింఛన్‌ కనీస అర్హత వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా అనేక మంది అర్హులకు న్యాయం జరుగుతుందన్నారు.

జూలై 1 నుంచి పింఛన్ల పెంపు..
పెంచిన పింఛన్లను జూలై 1 నుంచి లబ్దిదారులకు అందించనున్నట్లు పేర్కొన్నారు. 1281 ఆవాస ప్రాంతాల్లోని షెడ్యూల్డ్‌ ఏరియాలను, జనాభా ఆధారంగా మరో 688 గ్రామాలను ఎస్టీలకు రిజర్వ్‌గా చేసి మొత్తంగా 3146 మంది ఎస్టీలను సర్పంచులను చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనని తెలిపారు. తద్వారా అట్టడుగు వర్గాలను పాలనలో భాగస్వాములను చేసి దేశ చరిత్రలో ఆదర్శంగా నిలుస్తున్నామని వివరించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి బీసీలకు మరో 119 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విదేశీ విద్య కోసం వెళ్లే అన్నివర్గాల వారికి రూ.20లక్షల వంతున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. గ్రామ స్వరాజ్యాన్ని అమలులోకి తెచ్చే వ్యూహంలో భాగంగా అమలుపరుస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మకంగానే కాకుండా మిగితా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.

టీఎస్‌ ఐపాస్‌ సింగల్‌విండో విధానం ద్వారా 15 రోజుల్లో పరిశ్రమల స్థాపనకు అన్నిరకాల అనుమతులు లభిస్తుండడంతో పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారని తెలిపారు. దీంతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చి, వైద్య సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 12086 మంది గర్భిణీలు ప్రసవించగా, అందులో అర్హులైన 7,314 మంది బాలింతలకు కేసీఆర్‌ కిట్లను అందించినట్లు వివరించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల సంఖ్య పెరగడంతో పాటు శిశు మరణాల రేటు కూడా తగ్గించగలిగామని వివరించారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 18 బృందాలచే 3,49,373 మందికి పరీక్షలు నిర్వహించి 54,379 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 36,472 మందికి ప్రత్యేక కంటి శస్త్ర చికిత్సల కోసం సిఫార్సు చేయడం జరిగిందని తెలిపారు.

దేశానికి ఆదర్శం మన పథకాలు..
దేశానికే మన రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆమె అన్నారు. మిషన్‌ భగీరథ, చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్‌ కాకతీయ, నిరుపేదలకు ఉచితంగా నిల్వ నీడ కల్పించే డబుల్‌బెడ్‌రూం ఇల్లు, రైతుబంధు, రైతుబీమా, హరితహారం, కేసీఆర్‌ కిట్, ఆసరా పింఛన్లు తదితర పథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. గ్రామపంచాయతీలను క్రియాశీలం చేసేందుకు నూతన పంచాయతీరాజ్‌ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేసినట్లు తెలిపారు. పంచాయతీరాజ్‌ సంస్థలకు నిర్దిష్టమైన విధులు, బాధ్యతలను నిర్దేశిస్తూ కావాల్సిన నిధులను క్రమంతప్పకుండా ప్రభుత్వం సమకూర్చుతుందని వివరించారు.

జిల్లాలోని రైతులకు సాగునీరు అందించేందుకు పెన్‌గంగ ప్రాజెక్టు నిర్మాణాన్ని రూ.1594 కోట్ల వ్యయంతో మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు కోర్టా–చనాఖా బ్యారేజీ పైపులైన్‌లు, పంప్‌హౌజ్‌ వంటి పనులు రూ.438 కోట్ల వ్యయంతో చేపట్టడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి 51వేల ఆయకట్టుకు సాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. మిషన్‌ కాకతీయ పథకం కింద జిల్లాలో మొదటి మూడు దశలో ఇప్పటివరకు 288 చెరువు పనులు చేపట్టి రూ.94కోట్లతో 32,576 ఎకరాల ఆయకట్టు అభివృద్ధి పర్చడం జరిగిందన్నారు. నాలుగో దశలో 22 చెరువు పనులు ప్రారంభించామని అన్నారు. జిల్లా ఉద్యాన కార్యక్రమాల కింద 3093 మంది లబ్ధిదారులకు రూ.835 లక్షలతో సమగ్ర ఉద్యాన అభివృద్ధి సూక్ష్మసేద్యం, ఆదివాసీలకు బిందుసేద్యం పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. 

రహదారుల అభివృద్ధి
రహదారులు, భవనాల శాఖ ద్వారా జిల్లాలో రూ.350 కోట్లతో ఒక వరుస రహదారులను రెండు వరుస రహదారులుగా మార్చేందుకు నిధులు మంజూరై పనులు జరుగుతున్నాయని అన్నారు. రూ.30కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు, రూ.66 కోట్లతో వంతెనల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ద్వారా వివిధ పథకాల కింద 177 పనులకు గాను రూ.166 కోట్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. 5 మండల పరిషత్‌ భవనాలకు గాను రూ.5కోట్లు మంజూరు కాగా, పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.

జిల్లా పరిషత్‌ సాధారణ నిధుల నుంచి రూ.156 లక్షలతో 24 అంతర్గత రోడ్లు, తాగునీటి వసతి, మురుగు నీటి కాల్వలు, కల్వర్టుల నిర్మాణాలు, మరమ్మతులకు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి 82 పనులకు రూ.170లక్షలతో గ్రామీణ రోడ్లు, జిల్లా పరిషత్‌ పాఠశాల భవనాల నిర్వహణ పనులకు చేపట్టేందుకు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడం, ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. వివిధ విభాగాల్లో ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీల కారణంగా 420 మంది విద్యావాలంటీర్లను నియమించామన్నారు. జిల్లాకు మొదటి విడతలో 6 ఆదర్శ పాఠశాలలు, 17 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో 13 భవిత విలీన విద్యా కేంద్రాలు పనిచేస్తున్నట్లు వివరించారు. 275 మంది విద్యార్థులు ప్రత్యేక అవసరాలు గల వివిధ రకాల వైకల్యం గల పిల్లలుఇందులో విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు.

ఆదిమ గిరిజనుల అభ్యున్నతి..
ఆదిమ గిరిజనుల అభివృద్ధికి సీసీడీపీ కింద 2013–14 నుంచి 2016–17 సంవత్సరం వరకు సుమారు రూ.27కోట్లు మంజూరు కాగా, వివిధ పనులు ఎంపిక చేసి 12 గిరిజన గ్రామాల్లో అమలుపర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. గిరిజనుల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన చర్యలు చేపడుతూ వైద్యసేవలు అందిస్తున్నట్లు వివరించారు. 6,342 మంది గిరిజన విద్యార్థులకు రూ.1248 లక్షల పోస్టుమెట్రిక్, ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా ఇప్పటివరకు 430 పనులు పూర్తి చేసి సుమారు రూ.47 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. 2018–19 సంవత్సరానికి 1545 యూనిట్ల స్థాపనకు రూ.27.38 కోట్ల విలువ గల ప్రతిపాదనలు ట్రైకార్‌ ఎండీ ఆమోదం కోసం పంపించడం జరిగిందన్నారు. 756 మంది గిరిజన యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. 

కోటి 63 లక్షల మొక్కలు..
జిల్లాలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కోటి 63లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక చేసినట్లు పేర్కొన్నారు. నర్సరీల్లో  డిమాండ్‌కు అనుగుణంగా పువ్వులు, పండ్లు, ఇతర జాతుల మొక్కలను పెంచడం జరుగుతుందన్నారు. ఆదిలాబాద్‌ హరితవనంలో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని వివరించారు. ఆదిలాబాద్‌ సరిహద్దు మహరాష్ట్ర బార్డర్‌ నుంచి నిర్మల్‌ జిల్లా సరిహద్దు వరకు జాతీయ రహదారి నం.44కు ఇరువైపులా మొక్కలు నాటడం జరుగుతున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు అగ్రో ఫారెస్ట్రిని పెద్ద ఎత్తున అమలు చేసేందుకు ప్రణాళిక తయారు చేయడం జరిగిందన్నారు. మొదట జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారి కవాతు ఆకట్టుకుంది. అమరవీరుల కుటుంబ సభ్యులకు సన్మానం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు మైమరిపించాయి. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు, ఐసీడీఎస్‌ ఆర్గనైజర్‌ కస్తాల ప్రేమల, ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రంగినేని మనిషా, డీసీసీబీ చైర్మన్‌ దామోదర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రావుత్‌ మనోహర్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top