సర్వం.. సర్వేపైనే!

Telangana Elections TRS Leader Election Surveys Medak - Sakshi

తెలంగాణ రాష్ట్ర సమితిలో జహీరాబాద్‌ నియోజకవర్గం మినహా ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో పోటీ చేసే ఇతర నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చింది. ప్రధాన రాజకీయ పక్షం కాంగ్రెస్‌లో మాత్రం స్పష్టత ఉన్న చోట కూడా అభ్యర్థుల జాబితా ఖరారు కావడం లేదు. మరోవైపు టికెట్ల కోసం బహుముఖ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న నేతలు లాబీయింగ్‌లో మునిగి తేలుతున్నారు. కొందరు హైదరాబాద్, మరికొందరు ఢిల్లీ స్థాయిలో తమ పరిచయాలను ఉపయోగించుకుని టికెట్‌ సాధించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : జహీరాబాద్‌ మినహా ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. ప్రధాన రాజకీయ పక్షం కాంగ్రెస్‌లో మాత్రం అభ్యర్థులు ఎవరనే అంశంపై స్పష్టత రావడం లేదు. మహాకూటమి పేరిట తెలుగుదేశం, సీపీఐతో ఎన్నికల అవగాహన దాదాపు ఖాయం కావడంతో ఏయే స్థానాలు కూటమిలోని మిత్ర పక్షాలకు కేటాయిస్తుందో పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు. ఏక నాయకత్వం ఉన్న నియోజకవర్గాల్లో తొలి విడతగా రాష్ట్ర స్థాయిలో 40 మంది కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాను టీపీసీసీ ప్రకటిస్తుందనే వార్తలు వస్తున్నాయి.

తొలి జాబితాలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (అందోలు–ఎస్సీ), మాజీ మంత్రులు గీతారెడ్డి (జహీరాబాద్‌–ఎస్సీ), జగ్గారెడ్డి (సంగారెడ్డి), ప్రతాప్‌రెడ్డి (గజ్వేల్‌) పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఇతర నేతలెవరూ కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఆశించకపోవడంతో, జాబితా ప్రకటనలో పెద్దగా సమస్యలు ఉండే అవకాశం కనిపించడం లేదు. ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ టికెట్‌ కోసం బహుముఖ పోటీ నెలకొంది. మహాకూటమిలో భాగస్వాములైన సీపీఐ హుస్నాబాద్, తెలుగుదేశం పార్టీ పటాన్‌చెరు స్థానాన్ని కోరే సూచనలు కనిపిస్తున్నాయి.

గాడ్‌ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు
ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఆశిస్తున్న నేతలు ఏఐసీసీ, పీసీసీ స్థాయిలో తమకున్న పరిచయాలతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో డజనుకు పైగా దరఖాస్తులు అందడంతో సర్వే ఆధారంగా జాబితాను కుదిస్తామని ఔత్సాహికులకు టీపీసీసీ నుంచి సమాధానం వస్తోంది. కుదించిన జాబితాలోని వ్యక్తుల పలుకుబడి, ఆర్థిక పరిస్థితి, కుటుంబ నేపథ్యం, జనాదరణ తదితర కోణాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించినట్లు సమాచారం. సర్వే నివేదిక ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ చెబుతున్నట్లు తెలిసింది.

ఆశ వీడని నేతలు మాత్రం టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు వి.హనుమంతరావు, దామోదర రాజనర్సింహ, నాగం జనార్దన్‌రెడ్డి తదితరుల ద్వారా లాబీయింగ్‌ చేస్తున్నారు. మాజీ ఎంపీ విజయశాంతి కూడా మెదక్‌ నియోజకవర్గంలో ఓ నాయకుడికి మద్దతు ఇస్తున్నట్లు తెలిసింది. కొందరు నాయకులు గులామ్‌ నబీ ఆజాద్, ఆర్‌సీ కుంతియా, ఏఐసీసీ పరిశీలకుడు బోసురాజు తదితరులను కలిసి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతున్నారు.

ఆ ఆరు చోట్లా ఆసక్తికరం

  • హుస్నాబాద్‌ అసెంబ్లీ స్థానాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కోరుతున్నా, కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి ప్రచారాన్ని ప్రారంభించారు. మరో నాయకుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు.
  • సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తాడూరు శ్రీనివాస్‌గౌడ్, ప్రభాకర్‌ వర్మ, గంప మహేందర్‌రావు, పూజల హరికృష్ణ, గూడూరు శ్రీను, గొడుగు రఘు, కలీం తదితరులతో కలిపి మొత్తం 13 మంది కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.
  • దుబ్బాక నుంచి మాజీ మంత్రి ముత్యంరెడ్డి, డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌రెడ్డితో పాటు స్వచ్ఛంద సంస్థ పేరిట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఓ నేత కూడా దరఖాస్తు అందజేసినట్లు సమాచారం.
  • మెదక్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ కోరుతూ 14 మంది నాయకులు టీపీసీసీకి దరఖాస్తులు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, సుప్రభాతరావు, ప్రతాప్‌రెడ్డి, బట్టి జగపతి, అమరసేనారెడ్డి తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
  •  పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాటా శ్రీనివాస్‌గౌడ్, కార్పొరేటర్‌ శంకర్‌యాదవ్, జెడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్, గోదావరి అంజిరెడ్డి, శశికళ యాదవరెడ్డి తదితరులు దరఖాస్తులు అందజేశారు.
  •     నారాయణఖేడ్‌ నుంచి మాజీ ఎంపీ సురేశ్‌ షెట్కార్, ఎంపీపీ డాక్టర్‌ సంజీవరెడ్డి టికెట్ల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top