కీలక నేతలపై గురి 

Telangana Election Rebels Congress Leaders Warangal - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు గెలుపు వ్యూహాల అమలుపై నజర్‌ వేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు కొందరు విపక్షంలోని ద్వితీయ శ్రేణికి చెందిన ‘కీలక’ నేతల మీద గురిపెట్టారు. ఇదే సమయంలో ఇంకొందరు పోటీలో ఉన్న అభ్యర్థులు చీల్చే ఓట్ల మీద దృష్టి సారించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 స్థానా లకు గాను 172 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రతిచోటా ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరితో పాటు బీఎల్‌ఎఫ్, స్వతంత్రులు కూడా పోటీలో ఉన్నారు. ప్రస్తుతం అందరి దృష్టి వీరు ఏ మేరకు ఓట్లు సాధిస్తారు? ఎవరి ఓట్లు చీల్చుతారు? అనే దానిపైనే చర్చ కొనసాగుతోంది. పోటీలో ఉన్నప్పటికీ స్వతంత్రులను తమ వైపునకు తిప్పుకుని ఓట్లు పొందేందుకు యత్నిస్తున్నారు. వారు ప్రచారంలో పాల్గొనేలా నేతలు మంతనాలు జరుపుతున్నారు.

స్వతంత్రుల ఓట్లు కీలకం
కొన్ని నియోజకవర్గాల్లో ద్విముఖ.. మరికొన్ని చోట్ల త్రిముఖ పోటీ నెలకొంది. ‘త్రిముఖ’ పోరు ఉన్న చోట బీజేపీ, బీఎల్‌ఎఫ్, ఇతరులు సాధించే ఓట్ల మీదనే ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ‘త్రిముఖ’ పోటీ నెలకొన్న చోట బీఎల్‌ఎఫ్, స్వతంత్రులు సాధించే ఓట్లు కీలకంగా మారనున్నాయి. డోర్నకల్, మహబూబాబాద్‌లలో చతుర్ముఖ పోటీ.. భూపాలపల్లి, పరకాలలో త్రిముఖ పోటీ.. మిగిలిన చోట్ల  రెండు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని తెలుస్తోంది.

బీజేపీతో కూటమిలో ఆందోళన
ఒంటరిగా 12 స్థానాల్లో బరిలోకి దిగిన బీజేపీ ఈసారి ఎలాగైనా పాగా వేయాలనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అగ్రనేతలు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎక్కడ తమ ఓట్లను చీల్చుతారోననే ఆందోళనతో ఉన్నారు. అయితే బీజేపీ ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు  చీల్చే అవకాశం ఉండడంతో అటు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఆ వ్యతిరేక ఓట్లు ఎటుపోతాయోననే దిగులు కూటమి అభ్యర్థుల్లో నెలకొంది.

జంప్‌ అభ్యర్థుల ప్రభావం..
మహబూబాబాద్, స్టేషన్‌ ఘన్‌పూర్, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల్లో  టికెట్‌ ఆశించి భంగపడిన కొందరు నేతలు ఇతర పార్టీ నుంచి పోటీలో దిగారు. సామాజికవర్గ పరంగా బలంగా ఉండడం, ప్రధాన పార్టీ ఓట్లు చీల్చే అవకాశం నేపథ్యంలో ఇక్కడ చతుర్ముఖ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం ఉంది.

నేతల ప్రచారాలపై ఆశలు.. 
ఇక అగ్రనేతల ప్రచారాలపైనే అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే నిర్వహించిన సభలు, సమావేశాలు రోడ్‌షోల ప్రభావం ఇక ముందు మరింతగా కనిపించే వీలుంది. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ పార్టీ పెద్దల్ని ప్రచారానికి రప్పించేలా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇప్పటికే జిల్లాలోని  పాలకుర్తి, జనగామ, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్‌ నియోజకవర్గాల్లో ఆశీర్వాద సభలు నిర్వహించారు. మరోసారి కేసీఆర్‌ జిల్లాకు రానున్నారు. మరో వైపు జిల్లాలో  రాహుల్‌గాంధీ సభను నిర్వహించే దిశగా కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా తేదీలు ఖరారయ్యే వీలుంది. ఇక బీజేపీ నాయకులు నేతలు కూడా స్టార్‌ క్యాంపెయినర్లుగా ఆయా నియోజకవర్గాల్లో సభలకు హాజరుకానున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top