‘పోరు’గల్లు

Telangana Election Code Implementation Warangal - Sakshi

ఎన్నికల నగారా మోగింది... ‘కోడ్‌’ కూయడంతో మరో మహా సంగ్రామానికి ఓరుగల్లు సన్నద్ధమవుతోంది. నవంబర్‌లో ఎన్నికల ప్రక్రియ మొదలై డిసెంబర్‌లో ముగుస్తుందంటూ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఓపీ రావత్‌ శనివారం షెడ్యూల్‌ విడుదల చేయడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ప్రచారంలో దూసుకుపోతుండగా.. ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. మొత్తానికి జిల్లాలో ఎన్నికల కోలాహలం మొదలైంది. 
 

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ముందస్తు ఎన్నికల సమరానికి ఓరుగల్లు సిద్ధం అవుతోంది. నవంబర్‌లో ఎన్నికల ప్రక్రియ మొదలై డిసెంబర్‌లో ముగుస్తాయని ఎన్నికల సంఘం శనివారం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల సంఘం తొలుత మధ్యాహ్నం 12.30 గంటలకు విలేకరుల సమావేశం ఉంటుందని ప్రకటన చేసినప్పుడే సాధారణ ప్రజలు, పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు.. టీవీలు, సెల్‌ఫోన్లకు అతుక్కుపోయారు. మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేయడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏం జరుగుతుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చేశారు. నవంబర్‌ 12న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని, డిసెంబర్‌ 7న ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తామని, 11న కౌంటింగ్‌ జరుగుతుందని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఓపీ రావత్‌ తెలిపారు. దీంతో ఎన్నికల కోలాహలం మొదలైంది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ, జనగామ, పాలకుర్తి, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల నియోజకవర్గాల్లో జనరల్‌ అభ్యర్థులు, గు,  డోర్నకల్, మహబూబాబాద్‌ నియోజకవర్గాలు ఎస్టీ అభ్యర్థులు, వర్ధన్నపేట, స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గాలను ఎస్సీ అభ్యర్థులకు కేటాయించారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఒకటి రెండు రోజుల్లో మిగిలిన వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో అభ్యర్థిని కూడా ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచే టీఆర్‌ఎస్‌ ప్రచారంలో దూసుకుపోతోంది. అక్కడక్కడ అసంతృప్తి వ్యక్తమవుతున్నా ఇప్పటికైతే కారు ప్రచారం జోరు మీదనే కొనసాగుతోంది.

కూటమిలో తెగని సీట్ల పంచాయితీ..
టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు జట్టు కట్టిన మహాకూటమిలో ఇంకా సీట్ల పంచాయితీ తెగనే లేదు. జిల్లాలో టీడీపీ 3, టీజేఎస్‌ 2 సీట్ల చొప్పున డిమాండ్‌ చేస్తోంది. కానీ, కాంగ్రెస్‌ పార్టీ  చెరో సీటుకు మించి ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఒక్క సీటు ఇచ్చినా..! వారికి ఏ స్థానాన్ని కేటాయించాలనే దానిపై సందిగ్ధం నెలకొని ఉంది. రెండుమూడు రోజుల్లో సమస్యలన్నీ కొలిక్కి వస్తాయని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
  
పోటీకి బీజేపీ కసరత్తు..
మరో వైపు బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే  వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట, భూపాలపల్లి, నర్సంపేట నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు సమాచారం. పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇప్పటికే రావు పద్మారెడ్డి క్షేత్రస్థాయిలో పార్టీ పునఃనిర్మాణం చేసుకుంటూ వెళ్తున్నారు. బూత్‌ స్థాయి కార్యకర్తలతో రోజూ సమావేశం అవుతున్నారు. అయితే ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే  ధర్మారావు కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు.

తక్షణమే ఎన్నికల నిబంధనలు అమల్లోకి..
ఎన్నికల నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ భవనాలపై ఉన్న కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు 24 గంటల్లోగా, బహిరంగ ప్రదేశాల్లో 48 గంటల్లోగా తొలగించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నామని.. అధికారిక వాహనాల వినియోగం తక్షణమే రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అభివద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రకటనలు నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రచారం నిషేధమని.. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్స్, మొబైల్‌ టీమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఓటర్ల జాబితాపై హైకోర్టు ఏ ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తామని రజత్‌కుమార్‌ చెప్పారు. 

కోడ్‌.. అతిక్రమిస్తే కఠిన చర్యలు
హన్మకొండ అర్బన్‌: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. అయితే రాష్ట్రంలో శాసన సభ రద్దు నాటి నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ఇటీవల ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ విషయంలో పెద్దగా ఫిర్యాదులు, కార్యాచరణ లేదు. ప్రసుతం ఎన్నికల షెడ్యూల్‌ విడదల కావడంతో అధికార యంత్రాంగం కోడ్‌ అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌లోని ఎన్నికల కార్యాలయంలో 18004251115 టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్‌ పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో నోడల్‌ అధికారులను నియమించారు. ప్రవర్తనా నియమావళిని అతిక్రమించిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు. ఎన్నికల నియమా వళిని పాటించాలని ఆయన సూచించారు. 

ఎన్నికల నిబంధనలు ఇవే..

  • రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులు వీటిని పాటించాలి.
  • ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకూడదు. అందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదు.
  • ఇతర పార్టీలు చేసే ప్రచార సభలను అడ్డుకోకూడదు.
  • మతాలు, ýకులాల పేరిట ఓట్ల కోసం అభ్యర్థించకూడదు. 
  • స్థానిక ఎన్నికల అధికారి అనుమతి లేకుండా పార్టీలు, అభ్యర్థులు సమావేశాలు నిర్వహించరాదు. 
  • మైకుల వాడకానికి అనుమతి తప్పనిసరి.
  • మైకులను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంట వరకే ఉపయోగించాలి.
  • ప్రభుత్వ భవనాలు, అతిథి గృహాలను ఉపయోగించకూడదు.
  • ప్రచార పత్రాలకు సంబందించి కరపత్రాలు, ఇతరత్రా పత్రాలకు ప్రచురణ కర్త పేరు తప్పనిసరిగా ముద్రించాలి.
  • పోలింగ్‌ సమయానికి 48 గంటల ముందే ప్రచారం పూర్తిగా నిలిపివేయాలి.
  • పోలింగ్‌ రోజు పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో మాత్రమే ప్రచారం ఉం డాలి. ఓటింగ్‌ రోజు కేంద్రాల వద్ద ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించ కూడదు.
  • ఆయా పార్టీల నాయకులు..ప్రజల మధ్య ఎలాంటి విద్వేషాలు సృష్టించొద్దు.
  • భాష, మతపరమైన తగాదాలకు అవకాశం ఇవ్వొద్దు. దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఎన్నికల ప్రచారానికి వాడకూడదు.
  • ఏ రాజకీయ పార్టీని కించపరచొద్దు. అలాగే ఇంటి యజమాని అనుమతి లేకుండా ఇంటిపై బ్యానర్లు, జెండాలు, గోడ పత్రికలు అంటించరాదు. 
  • ఇతర పార్టీ జెండాలు, కరపత్రాలు చించకూడదు.

ఎన్నికల యంత్రాంగం,ఉద్యోగులు పాటించాల్సినవి...

  • ఎన్నికల ప్రచారానికి వెళ్లే మంత్రులు, ప్రజాప్రతినిధులతో ప్రభుత్వ సిబ్బంది వెళ్లకూడదు.
  • అధికా పార్టీ, అధికార యంత్రాంగం, సిబ్బంది అధికారిక వాహనాలను వినియోగించడానికి వీలు లేదు.
  • సివిల్‌ సర్వెంట్లు మినహా ఎవరూ ఎటువంటి ప్రాజెక్టులు, పథకాల కోసం పునాది రాళ్లు వేయకూడదు.
  • అధికారంలో ఉన్న పార్టీకి మేలు చేసేలా ప్రభుత్వ, ప్రభుత్వ రంగసంస్థల్లో తాత్కాలిక నియామకాలు చేపట్టడానికి వీలు లేదు. ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న అధి కారుల బదిలీపై నిషేధం. ఒక వేళ బదిలీలు చేయాల్సివస్తే తప్పనిసరిగా ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 
  • ఇప్పటికే పనులు మంజూరు చేసినప్పటికీ ప్రస్తుతం వాటిని మొదలు పెట్టడానికి వీలులేదు. 
  • బహిరంగ స్థలాల్లో ఎన్నికల సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి అందరికీ సమాన అవకాశాలు ఇవ్వలి.
  • జెడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న నాయకులకు విశ్రాంతి భవనాలు, ఇతర ప్రభుత్వ వసతి సదుపాయాలను ప్రభుత్వ నిబంధనలకు లోబడి కల్పించవచ్చు.
  • అయితే అక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top