ప్రత్యేక నిఘా

Telangana Election Allart Police Department Mahabubnagar - Sakshi

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎవరు కూడా మద్యం ఇస్తూ ఓటర్లను ప్రలోభపెట్టకుండా పోలీసు, ఎక్సైజ్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేష్‌కుమార్‌ సూచించారు. మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులు, ఎక్సైజ్‌ అధికారులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సోమేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ సరిహద్దు ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి మద్యాన్ని దిగుమతి చేసుకునే అవకాశమున్నందున ప్రత్యేక నిఘా ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అన్ని చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలు, టీవీల ఏర్పాటుతో పాటు అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటుకు నివేదిక పంపిస్తే నిధులు విడుదల చేస్తామని తెలిపారు.

ప్రతీ నియోజకవర్గంలో సీనియర్‌ అధికారి, నోడల్‌ అధికారి, రిటర్నింగ్‌ అధికారులు తరచు సమీక్షించాలని.. ఎక్కడైతే ఎక్కువమొత్తంలో మధ్యం అమ్మకం జరుగుతుందో అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం పోలీసు శాఖ సిబ్బంది పెట్రోలింగ్‌ చేయాలని సూచించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కమిషన్, కలెక్టర్‌ నుండి కానీ పత్రికల ద్వారా సమస్యలు వెల్లడైతే వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. పోలీసు, ఎక్సైజ్‌ శాఖల ఆధ్వర్యాన ఏర్పాటు చేసే చెక్‌పోస్టులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్, ఎస్పీ రెమారాజేశ్వరి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు మద్యం అమ్మకాలు, అక్రమ సరఫరా నివారణకు చేపట్టిన చర్యలు వివరించారు. సమావేశంలో ఎక్సైజ్‌ శాఖ ఉమ్మడి జిల్లా డీసీ జయసేనారెడ్డి, ఈఎస్‌ అనితతో పాటు ఎక్సైజ్, పోలీసు శాఖల సీఐలు, అధికారులు పాల్గొన్నారు.

అక్రమ మద్యం, గుడుంబా నివారణకు రెండు బృందాలు 
సాధారణ ఎన్నికల నేపథ్యంలో మద్యం, గుడుంబా సరఫరాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని, ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలను అరికట్టేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ కోరారు. మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలోని వైన్‌షాపులు, బెల్ట్‌షాపులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. రిమోట్‌ ఏరియాల వద్ద నిఘా ఏర్పాటు చేసి అక్రమ కార్యకలాపాలపై చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. రిటైల్‌గా కాకుండా పెద్దమొత్తంలో ఒకేసారి మద్యం అమ్మితే నేరమవుతుందన్నారు.

ప్రతీ షాపులో సీసీ కెమెరాలు ఉండాలని, నిబంధనలకు విరుద్ధంగా మద్యం బయటికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ షాపులోనైనా ఉన్న స్టాక్‌లో 50 శాతం వరకే అమ్మాలని, దానికంటే ఎక్కువగా అమ్మితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్టాక్‌ రిజిస్టర్‌ నిర్వహించాలని సూచించారు. ఈ అంశాలన్నింటినీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్‌టీఎఫ్‌ బృందాల తనిఖీలకు రాజకీయ పార్టీల నాయకులు సహకారం అందించాలని కోరారు. సమావేశంలో ఎస్పీ రెమారాజేశ్వరి, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, డీఆర్వో కె.స్వర్ణలతతో పాటు వివిధ పార్టీ ల నాయకులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top