మరో 52 మందికి కరోనా పాజిటివ్‌

Telangana: 52 New Corona Positive Cases Reported - Sakshi

రాష్ట్రంలో 644కు చేరిన వైరస్‌ కేసులు

ఒకరి మృతి.. 18కి చేరిన మరణాలు

హైదరాబాద్‌లోనే ఎక్కువ కేసులు

ఆ తర్వాతి స్థానాల్లో నిజామాబాద్, వికారాబాద్‌

హైదరాబాద్‌లో కుటుంబం మొత్తానికి కరోనా

12 లక్షల మందిని సర్వే చేసిన అధికారులు

ఇకపై ఈఎస్‌ఐ, సీడీఎఫ్‌డీలోనూ పరీక్షలు

సాక్షి, హైదరాబాద్‌ : సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం మరో 52 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 644కి చేరుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఒకరు చనిపోవడంతో మరణాల సంఖ్య 18కి చేరుకుంది. తాజాగా ఏడుగురు డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు 103 మంది కరోనాను జయించి ఇంటికి వెళ్లారు. ఈ మేరకు ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ రావు మంగళవారం రాత్రి బులెటిన్‌ విడుదల చేశారు. మొత్తం 28 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదు కాగా, ఆ తర్వాత నిజామాబాద్, వికారాబాద్‌ జిల్లాలున్నాయి. సోమవారం 61 కేసులు నమోదు కాగా, మంగళవారం 52 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో వైరస్‌ వ్యాప్తిలో వేగం తగ్గలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన పాజిటివ్‌ కేసుల్లో మర్కజ్‌కు సంబంధించినవే ఎక్కువగా ఉండటం గమనార్హం. 

25 జిల్లాల్లో 221 కంటైన్మెంట్‌ ప్రాంతాలు
వైరస్‌ అధికంగా ప్రబలుతున్న ప్రాంతాలను ప్రభుత్వం కంటైన్మెంట్‌ ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 28 జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి చెందగా, 25 జిల్లాల్లో 221 కంటైన్మెంట్‌ ప్రాంతాలను సర్కారు ఏర్పాటు చేసింది. ఇందులో 3.01 లక్షల ఇళ్లకు వెళ్లి వైద్యాధికారులు సర్వే చేశారు. మొత్తం 12.04 లక్షల మంది వివరాలు నేరుగా సేకరించారు. కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఏవైనా ఉన్నాయా.. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారి సెకండరీ కాంటాక్టులను గుర్తించి పరీక్షలు చేస్తున్నట్లు బులెటిన్‌ లో పేర్కొన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి నోటిఫైడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌ జిల్లాలో అధిక కేసులు నమోదు కావడంతో జీహెచ్‌ఎంసీ ప్రాంతాల్లో కేసులు నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 30 జీహెచ్‌ఎంసీ సర్కిళ్లకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టేందుకు సీనియర్‌ వైద్యాధికారులను నియమించారు. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రజారోగ్య డైరెక్టర్‌ తెలిపారు. ఏడు డయాగ్నస్టిక్‌ సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెంచి కరోనా లక్షణాలున్న అనుమానిత కేసులను గుర్తిస్తున్నట్లు తెలిపారు. 

మరో 2 ల్యాబ్‌ల్లో పరీక్షలు..
ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ల్యాబ్‌లకు తోడుగా సనత్‌నగర్‌ ఈఎస్‌ఐలో, సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ఫ్రింటింగ్‌ డయాగ్నస్టిక్స్‌ (సీడీఎఫ్‌డీ)లలోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని వైద్యాధికారులు తెలిపారు. ఈ మేరకు కేంద్రం నుంచి అనుమతి వచ్చిందన్నారు.

ఒకే కుటుంబంలో 18 మందికి వైరస్‌
యాకుత్‌పురా(హైదరాబాద్‌): పాతబస్తీ తలాబ్‌కట్టా ఆమన్‌నగర్‌–బిలో ఒకే ఇంట్లో 18 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 10న ఈ ప్రాంతానికి చెందిన 68 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందారు. ఆమెకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో కుటుంబసభ్యులను పరీక్షించగా.. 17 మందికి కూడా వైరస్‌ సోకిందని నిర్ధారించారు. వీరందరినీ వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరితో పాటు మరో 24 మంది బంధువులకు పరీక్షలు నిర్వహించగా, వారికి నెగెటివ్‌ వచ్చింది.

మంగళవారం         నమైదనవి        మొత్తం
పాజిటివ్‌ కేసులు         52            516
డిశ్చార్జి అయినవారు    07            110
చనిపోయినవారు        01             18
––––––––––––––––––––––––––––––––––    
మొత్తం కేసులు                    644

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top