నేడే ‘దేశం’ మహానాడు | TDP maha nadu to be started from today | Sakshi
Sakshi News home page

నేడే ‘దేశం’ మహానాడు

May 27 2015 2:29 AM | Updated on Aug 11 2018 4:28 PM

నేడే ‘దేశం’ మహానాడు - Sakshi

నేడే ‘దేశం’ మహానాడు

రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ తొలిసారిగా రెండు రాష్ట్రాలకు కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్న మహానాడు (పార్టీ విస్తృతస్థాయి భేటీ) బుధవారం నుంచి ప్రారంభం కానుంది.

3 రోజులు గండిపేటలో నిర్వహణ
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ తొలిసారిగా రెండు రాష్ట్రాలకు కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్న మహానాడు (పార్టీ విస్తృతస్థాయి భేటీ) బుధవారం నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు హైదరాబాద్ గండిపేటలోని తెలుగు విజయంలో జరగనున్న ఈ మహానాడుకు భారీ  ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉండగా, తెలంగాణలో అస్థిత్వాన్ని నిలుపుకొనేందుకు అష్టకష్టాలు పడుతున్న సమయంలో మహానాడు నిర్వహిస్తున్నారు.
 
 తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన పార్టీ ప్రతినిధులనూ ఈ సమావేశాలకు ఆహ్వానించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చ చేపడుతున్నా ఏపీ విషయాలపైనే ఎక్కువ దృష్టి సారించనున్నారు. ఎన్నికల హామీలు  అమలు చేయలేకపోయిందని అన్ని రాజకీయ పక్షాలు, ప్రజల నుంచి విమర్శలు తీవ్రమైన నేపథ్యంలో... పాలనను సమర్థించుకునే బాటలో నేతలకు ప్రసంగాలు తయారు చేసి ఇచ్చారు. విభజన విషయంలో రెండు ప్రాంతాల మనోభావాలకు ఇబ్బంది రాకుండా కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ నేతలు ప్రసంగించనున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రుణ మాఫీ చేయలేదని విమర్శలు చేయాలంటే ఏపీలోనూ అదే పరిస్థితి ఉండటంతో అలాంటి అంశాల జోలికి వెళ్లకుండా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రస్తుతించడమే ప్రధానంగా సమావేశాలు పరిమితం కానున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని పల్లెత్తు మాట అనకుండా జాగ్రత్త పడనున్నారు.
 
లోకేశ్ దారికి లైన్:లోకేశ్‌కు పార్టీలో కీలక పదవి కట్టబెట్టాలని యత్నిస్తున్న చంద్రబాబు నేతలతో వేదికపై డిమాండ్  చేయించనున్నారు. ఇప్పటికే విశాఖపట్నం వంటి జిల్లా మహానాడుల్లో లోకేశ్‌కు కీలక బాధ్యతలు అప్పగించాలని తీర్మానాలు చేశారు. ఈ మహానాడులో మరోసారి చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. మహానాడులో 30కిపైగా తీర్మానాలను ప్రవేశపెట్టే అవకాశముంది. ఏపీకి సంబంధించి 14, తెలంగాణకు చెందిన 10 అంశాలపై  తీర్మానాలు రూపొందించారు.  పార్టీకి జాతీయ హోదా,  విస్తరణ అవకాశాలపై చర్చిస్తారు. తెలంగాణకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని నియమించాలన్న ఆలోచన ఉన్నా ఆ అధికారాన్ని అధ్యక్షుడికి కట్టబెడుతూ ఒక తీర్మానం చేయడంతో సరిపుచ్చుతారన్న మాట వినిపిస్తోంది.  పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్‌ను మార్చే అంశంపై కమిటీ కసరత్తు చేస్తోందని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చెప్పారు. కాగా,  మహానాడు ప్రాంగణాన్ని టీడీపీ కార్యకర్తల సహాయనిధి కన్వీనర్ నారా లోకేశ్ మంగళవారం పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement