
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పౌల్ట్రీ రంగానికి మరింత లబ్ధి చేకూర్చేలా దేశంలోనే ఉత్తమ పాలసీని తయారు చేస్తామని, దీనిపై అధ్యయనం చేసి త్వరలోనే నివేదికను సీఎం కేసీఆర్‌కు అందజేస్తామని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. పౌల్ట్రీ రంగ అభివృద్ధిపై ఏర్పాటు చేసిన రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమావేశం తలసాని అధ్యక్షతన శుక్రవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగింది.
ఈ సమావేశానికి సబ్‌కమిటీ సభ్యులు ఈటెల రాజేందర్, వి.శ్రీనివాస్‌గౌడ్‌లతో పాటు ఉన్నతాధికారులు, కోళ్ల పెంపకం దారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ పోటీ మార్కెట్‌లో పౌల్ట్రీ రంగం నిలదొక్కుకునే విధంగా ప్రభుత్వం అందించదగిన సహాయ సహకారాలపై అధ్యయనం చేస్తామని, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీలను కూడా పరిశీలిస్తామని చెప్పారు.