అన్నిటికీ ఆధార్ | T goverment mulls over aadhaar linkage to schemes | Sakshi
Sakshi News home page

అన్నిటికీ ఆధార్

Jul 18 2014 1:39 AM | Updated on Oct 30 2018 8:01 PM

అన్నిటికీ ఆధార్ - Sakshi

అన్నిటికీ ఆధార్

రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ పథకాలన్నింటికీ ఆధార్‌తో లంకె పెట్టాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది.

సంక్షేమ పథకాలకు తప్పనిసరి చేయాలని టీ సర్కారు యోచన
అక్రమాలకు చెక్ పెట్టేందుకు ‘ఆధారే’ ఆధారమని భావన  
పెన్షన్లు, ‘కల్యాణ లక్ష్మి’ లబ్ధిదారులకు వర్తింపజేసేందుకు కసరత్తు
కొత్త పెన్షన్ కార్డుల జారీసమయంలోనే వివరాల సేకరణ
‘కల్యాణ లక్ష్మి’ కింద వధువుపేరిటే రూ. 50 వేల నగదు డిపాజిట్


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ పథకాలన్నింటికీ ఆధార్‌తో లంకె పెట్టాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ప్రభుత్వ ప్రయోజనాలు పొందాలంటే విధిగా ఆధార్ కార్డు వివరాలు సమర్పించాలన్న నిబంధన పెట్టే యోచన చేస్తోంది. మార్గదర్శకాల జారీ సమయంలోనే ఈ విషయాన్ని స్పష్టం చేయనుంది. ఇప్పటికే సామాజిక పెన్షన్లకు దీన్ని అమలు చేసే కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్రమాలకు తావు లేకుండా పథకాలను అమలు చేసేందుకు ఆధార్ వివరాలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే రాష్ర్టంలోని పింఛన్‌దారులంతా విధిగా ఆధార్ కార్డుల వివరాలు సమర్పించాల్సి ఉంటుందని కూడా చెబుతున్నాయి. దసరా-దీపావళి మధ్య కాలంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పెన్షన్ కార్డులు జారీ చేసి.. పింఛన్ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలోనే వేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త కార్డుల జారీ సమయంలోనే పింఛన్‌దారులు విధిగా వారి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని, లేదంటే వారికి పెన్షన్ అందదని అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ లబ్ధిదారులు కొత్తగా ఆధార్ కార్డు పొందే క్రమంలో ప్రభుత్వానికి వివరాలు సమర్పించడానికి ఆలస్యమైతే.. ఆ వివరాలు అందిన తర్వాత అప్పటి వరకు ఇవ్వాల్సిన బకాయిలను కూడా కలిపి పింఛన్ మొత్తాన్ని ఒకేసారి చెల్లించనున్నట్లు ఓ ఉన్నతాధికారి వివరించారు.
 
తెలంగాణలో అన్ని వర్గాలకు చెందిన దాదాపు 30.85 లక్షల మంది పింఛన్‌దారులు ఉన్నారు. బ్యాంకు అకౌంట్లు, ఆధార్ కార్డు, బయోమెట్రిక్ వివరాలు లేని కారణంగా దాదాపు ఐదున్నర లక్షల మందికి రెండు నెలలుగా పెన్షన్ చెల్లించడం లేదు. వీరంతా తప్పుడు పత్రాలతో పెన్షన్ పొందుతున్నారని అధికారవర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుత మున్న పింఛన్ మొత్తాన్ని భారీగా పెంచుతున్న నేపథ్యంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కారాదని సీఎం కేసీఆర్ నొక్కి చెబుతున్నారు. దీంతో ప్రధానంగా అక్రమాలను అరికట్టడానికే ఈ కొత్త కార్డుల జారీ కార్యక్రమాన్ని రాష్ర్ట ప్రభుత్వం చేపడుతోంది. దీన్ని పూర్తి పారదర్శకంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ ఆధార్‌కార్డులు జారీ కాని గ్రామ పంచాయతీలు తమకు సమాచారమిస్తే ఆధార్ నమోదు కోసం సిబ్బందిని ఆయా గ్రామాలకు పంపిస్తామని ఓ ఉన్నతాధికారి చెప్పారు.
 
‘కల్యాణ లక్ష్మి’కి కూడా వర్తింపు
దళిత, గిరిజన అమ్మాయిల వివాహానికి రూ. 50 వేల చొప్పున నగదు సాయం అందించేందుకు ముఖ్యమంత్రి తాజాగా ప్రకటించిన ‘కల్యాణ లక్ష్మి’ పథకానికి కూడా ఆధార్‌నే ఆధారంగా తీసుకోనున్నట్లు సమాచారం. వధూవరులకు విధిగా ఆధార్‌కార్డు ఉండాలని, అమ్మాయి పేరిట బ్యాంకు అకౌంట్ ఉండాలని నిబంధనలు విధించనున్నారు. పెళ్లి ఫొటోలు, ఆధార్ కార్డు, ఇతర వివరాలతో ‘ఆన్‌లైన్’లోనే దర ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే రూ. 50 వేల నగదును పెళ్లి కూతురు పేరిట బ్యాంకులో జమ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ డబ్బును ఎవరికి ఇవ్వాలన్నది వధువు ఇష్టమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏటా దాదాపు లక్ష వరకు ఎస్సీ, ఎస్టీ అమ్మాయిల పెళ్లిళ్లు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
 
‘ఆధార్’ వల్లే ఉపాధి నిధులు భద్రం!
ఉపాధి హామీ పథకాన్ని ఆధార్ కార్డుతో అనుసంధానించడం వల్ల భారీగా నిధులు పక్కదారి పట్టకుండా అడ్డుకోగలిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకు నిదర్శనంగా ఇటీవల బయటపడిన ఓ విషయాన్ని వెల్లడించారు. ఉపాధి హామీలో పని చేసినట్లు రికార్డులు సృష్టించి కోట్ల నిధులు మింగేయడానికి క్షేత్రస్థాయిలో జరిగిన యత్నం ఆధార్ లంకె వల్ల బయటపడిందని పేర్కొన్నారు. తప్పుడు రికార్డులతో పెట్టుకున్న బిల్లులకు సంబంధించిన రూ. 78 కోట్ల నిధులు ప్రస్తుతం పోస్టాఫీసుల్లోనే మూలుగుతున్నాయి. వాటిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. నిజమైన కూలీలైతే తమ ఆధార్ కార్డును చూపించి నిధులు తీసుకెళ్లేవారని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement