గోదాం | Sakshi
Sakshi News home page

గోదాం

Published Tue, Nov 11 2014 2:19 AM

గోదాం

దారి మళ్లుతున్న రేషన్‌బియ్యం
తంగడపల్లిలో లారీని తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు
213 క్వింటాళ్ల బియ్యానికి  ఉన్నది 176 క్వింటాళ్లే..

 
రేషన్ బియ్యం గోదాములనుంచే పక్కదారి పడుతుందని చెప్పడానికి బలం చేకూర్చే ఘటన చౌటుప్పల్ మండలం తంగడపల్లిలో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో సోమవారం వెలుగుచూసింది. కాంట్రాక్టర్లు, ఎంఎల్‌ఎస్ పాయింట్ల ఇన్‌చార్జ్‌లు, రేషన్‌డీలర్లు కలిసి గోదాముల నుంచే లారీల బియ్యాన్ని మాయం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
 
చౌటుప్పల్ రేషన్ బియ్యం సరఫరా చేసే కాంట్రాక్టర్లు, ఎంఎల్‌ఎస్ పాయింట్ల ఇన్‌చార్జ్‌లు, రేషన్ డీలర్లు కుమ్మక్కై ఐఎంజీ గోదాముల నుంచే లారీలకొద్దీ రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. గతంలో రేషన్ దుకాణాల నుంచి రాత్రి పూట వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అమ్ముకునే వారు. ఇటీవలి కాలంలో అంతా కుమ్మక్కై గోదాముల నుంచే కాంట్రాక్టర్లే పక్కదారి పట్టిస్తున్నారు. ఈ వైనంపై గత నెల 25న ‘లారీల కొద్దీ పక్కదారి’ అనే శీర్షికన కథనం ప్రచురించాం. అధికారుల నుంచి స్పందన కరువైంది. దీంతో గోదాం నుంచి బియ్యం పక్కదారి పడుతున్న వైనాన్ని ప్రత్యక్షంగా వెలుగులోకి తెచ్చేందుకు సోమవారం సాక్షి, సాక్షి టీవీ రంగంలోకి దిగింది. బియ్యాన్ని ఎలా పక్కదారి పట్టిస్తున్నారో బట్టబయలైంది.

చౌటుప్పల్‌లోని ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి ఏపీ16టీటీ 4921అనే నంబరు గల లారీ 213.67క్వింటాళ్ల బియ్యం, 8క్వింటాళ్ల చక్కెరతో సోమవారం మధ్యాహ్నం బయలుదేరింది. సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లి, రాధానగర్‌తండా, మర్రిబావింతండాల్లోని రేషన్ దుకాణాలకు సరఫరా చేయాలి. గోదాంలోనే 45క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తగ్గించి, సంస్థాన్ నారాయణపురం మండలానికి లారీ వెళ్తుందని వచ్చిన సమాచారం మేరకు గోదాం నుంచే వెంబడించింది. సుమారు 2కి.మీ.ల దూరం వెళ్లాక తంగడపల్లిలో లారీని ఆపి, పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులకు సమాచారమివ్వడంతో, అధికారులు వచ్చి లారీలోని బియ్యాన్ని లెక్కించారు. 427బస్తాలకు గానూ 353బస్తాలే ఉన్నాయి. 74బస్తాలు అనగా, 37.17క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్టు అధికాారులు గుర్తించారు. పంచనామా నిర్వహించారు. కాంట్రాక్టర్‌పై, ఐఎంజీ గోదాం ఇన్‌చార్జ్‌పై చర్య తీసుకోమని జాయింట్ కలెక్టర్‌కు నివేదించనున్నట్టు డివిజనల్ విజిలెన్స్ ఇన్‌చార్జ్ అధికారి ఉదయ్‌కుమార్, డీటీసీఎస్ ఎల్లేశం, ఆర్‌ఐ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు.

 రెండు దుకాణాలకు చెందిన బియ్యమే పంపా : మాధవిలత, గోదాం ఇన్‌చార్జి  రాధానగర్ తండా, వావిళ్లపల్లి గ్రామాలకు చెందిన రెండు రేషన్ దుకాణాలకు సంబంధించిన 166.11క్వింటాళ్ల బియ్యాన్ని మాత్రమే పంపా. మర్రిబావితండాకు సంబంధించి పంపలేదు. నేను రికార్డులు రాసుకుంటూ పనిలో ఉన్నా. హామాలీలు ఎన్ని బస్తాలు వేసుకెళ్లారో తెలియదు.
 
జేసీకి నివేదించా


గోదాం ఇన్‌చార్జి, లారీడ్రైవర్ కుమ్మక్కై బియ్యాన్ని పక్కదారి పటించినట్టు అవగతమవుతోంది. ఇద్దరూ కలిసి రెండు రేషన్ దుకాణాలకు చెందిన బియ్యమేనని వాంగ్మూలమిచ్చారు. రెండు దుకాణాలకు చెందిన బియ్యమే అయితే 166.11క్వింటాళ్లుండాలి. కానీ లారీలో 176క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించాం. వారు చెప్పినట్టు 10క్వింటాళ్ల బియ్యం ఎక్కువగా ఉండడానికి కూడా వీల్లేదు. ఇదే విషయాన్ని జేసీకి మెసేంజర్ ద్వారా సోమవారం రాత్రే నివేదించా.
 - ఉదయ్‌కుమార్, సివిల్‌సప్లై విజిలెన్స్ డివిజన్ ఇన్‌చార్జ్, భువనగిరి
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement