బెయిల్‌పై విడుదలైన స్వాతి

Swathi released on bail - Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం: నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో గత ఏడాది నవంబర్‌ 26న ప్రియుడు రాజేశ్‌తో కలసి భర్త సుధాకర్‌రెడ్డిని హత్య చేసిన కేసులో నిందితురాలు స్వాతి శుక్రవారం బెయిల్‌పై విడుదలైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈనెల 16నే ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. ఇద్దరు వ్యక్తుల జామీను (పూచీకత్తు) అవసరం ఉండగా.. ఎవరూ ముందుకు రాక ఆమె జైలులోనే ఉండాల్సి వచ్చింది.

కాగా, బుధ వారం నాగర్‌కర్నూల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వగా శుక్రవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌ జిల్లా జైలుకు, కోర్టు నుంచి ఉత్తర్వులు అందాయి. దీంతో ఆమెను సాయంత్రం జైలు నుంచి విడుదల చేశారు. అయితే స్వాతిని తీసుకువెళ్లడానికి కుటుంబ సభ్యులు, బంధువులెవరూ జైలు దగ్గరకు రాలేదు. ఈ నేపథ్యంలో స్వాతి, ముందుగానే కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు జైలు నుంచి విడుదలయిన తర్వాత ఆశ్రయం కల్పించాలని లేఖ రాశారు.

దీంతో కలెక్టర్, న్యాయసేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా జైలు అధికారులు స్వాతిని నేరుగా జిల్లా కేంద్రంలోని రాష్ట్ర సదనానికి తరలించారు. ఈ కేసులో మరో నిందితుడు రాజేశ్‌కు ఇంకా బెయిల్‌ లభించలేదు. భర్తను హత్య చేసిన తర్వాత స్వాతి, అతని స్థానంలో ప్రియుడు రాజేశ్‌ను ప్రవేశపెట్టేందుకు ఆయన ముఖంపై యాసిడ్‌ పోసి భర్తగా నమ్మించాలని చూసిన సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top