హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణం త్వరగా పూర్తి కావడానికి సహకారం అందిస్తామని...
- దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్
-కేంద్ర మంత్రి దత్తాత్రేయ
ఉప్పల్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణం త్వరగా పూర్తి కావడానికి సహకారం అందిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఉప్పల్‌లో మెట్రో రైలు పని తీరు, స్టేషన్ నిర్మాణం, రైళ్లను ఎంపీ మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్‌తో కలసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సాంకేతిక అంశాలను, రైలు నడిచే తీరు, టికెట్ల జారీని మెట్రో ప్రాజెక్ట్ ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి మంత్రికి క్షుణ్ణంగా వివరించారు. అనంతరం మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ దేశంలోనే ప్రతిష్టాత్మకమైందని పేర్కొన్నారు.
ప్రాజెక్టు పూర్తయిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారని తెలిపారు. మెట్రోలో అధిక శాతం ఉద్యోగాలను స్థానికులకు కేటాయిస్తామని తెలిపారు. రైతులు భూములు త్యాగం చేయడంతోనే మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఆటంకం లేకుండా ముందుకు సాగుతుందని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి అన్నారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని ఎన్‌వీఎస్ రెడ్డి అన్నారు. ప్రతి రెండు నిమిషాలకోసారి రైలునునడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.