ఉక్కుకర్మాగారం నిర్మించి తీరుతాం

Steel factory will be built - Sakshi

మంత్రి కేటీఆర్‌

కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం నాన్చివేత ధోరణి

అయినా.. సింగరేణి, ప్రైవేట్‌ సంస్థల సహకారంతో ముందుకు..

ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇస్తామని వెల్లడి

సాక్షి, కొత్తగూడెం: ఆరు నూరైనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించి తీరుతామని ఐటీ, పురపాలక మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్తగూడెం లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

బయ్యా రంలో ఉక్కు కర్మాగార ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. కేవలం మాటల ప్రభుత్వంగానే కేంద్రం మిగిలిపోతుందన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు ఎంతో దూరంగా ఉన్న విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పా టు సాధ్యమైనప్పుడు, అతి తక్కువ దూరంలో ఉన్న బయ్యారంలో ఎందుకు సాధ్యం కాదని ఆయ న ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ఈ కర్మాగార ఏర్పాటుపై కేంద్రంతో పలు దఫాలుగా చర్చించామని, చివరకు రైల్వే లైను నిర్మాణంలో సగం నిధులను రాష్ట్రప్రభుత్వమే భరించేటట్టుగా ముందు కొచ్చినా కేంద్రం దీనిపై ఒక్క అడుగు ముందుకు వేయలేదని కేటీఆర్‌ విమర్శించారు. కేంద్రం ముందుకు రాకున్నా సింగరేణి, ఇత ర స్థానిక ప్రైవేట్‌ పారిశ్రామిక సంస్థల సహకారం తో ఆరు నూరైనా జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించి తీరుతామని ఉద్ఘాటించారు. అలాగే.. ఉద్యోగాల్లో స్థానిక యువతకే ప్రాధాన్యం దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు.

జిల్లాలో విమానాశ్రయ నిర్మాణం ఏర్పాటు  
జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతుందని   కేటీఆర్‌ పేర్కొన్నారు. నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత పరిపాలన వికేంద్రీకరణ జరిగిందని, దీనివల్ల మారుమూల ప్రాంత ప్రజల చెంతకే న్యాయం చేరుతుందన్నారు. గత 40 ఏళ్ల లో జరగని అభివృద్ధి ఈ నాలు గేళ్లలో కేసీఆర్‌ నాయకత్వంలో సాధ్యమైందన్నారు.

ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని దేశంలోనే మిన్నగా తీర్చిదిద్దుకుంటామని, దీని కి అందరూ సహకరించాలని కేటీఆర్‌ కోరా రు. సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సింగరేణి, ఐటీసీ, జాన్‌డీర్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

మంత్రిని అడ్డుకున్న విద్యార్థులు
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ను మైనింగ్‌ కళాశాల విద్యార్థులు అడ్డుకున్నారు. శిలాఫలకం వద్దకు దూసుకొచ్చి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో కేటీఆర్‌ విద్యార్థుల వద్దకు వచ్చారు.

కళాశాలకు సరిపడా అధ్యాపకులు లేరని, సౌకర్యాలు సరిగా లేవని, ఒక్క కంపెనీ నుంచి కూడా ప్లేస్‌మెంట్‌ ఇప్పించలేదని విద్యార్థులు వాపోయారు. ఒకసారి కళాశాలను సందర్శించాలని డిమాండ్‌ చేశారు. దీంతో కేటీఆర్‌ మాట్లాడుతూ సమస్యను విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పినా.. విద్యార్థులు వినకుండా నినాదాలు చేయడంతో మణుగూరు పర్యటన ఆలస్యం అవుతోందంటూ అక్కడి నుంచి వెనుదిరిగారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top