పార్లమెంటరీ కార్యదర్శుల పేరును సీఎం రిప్రజెంటేటివ్స్ (ముఖ్యమంత్రి ప్రతినిధులు)గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
పార్లమెంటరీ కార్యదర్శుల పేరు మార్చే యోచనలో ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటరీ కార్యదర్శుల పేరును సీఎం రిప్రజెంటేటివ్స్ (ముఖ్యమంత్రి ప్రతినిధులు)గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పదవులకు సంబంధించిన జీవో చెల్లదని, పార్లమెంటరీ కార్యదర్శుల పదవులను రద్దు చేయాలని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో వీటిని కొనసాగించాలా.. వద్దా.. అనే విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో ఉంది. సీఎం సూచనల మేరకు న్యాయపరమైన చిక్కుల్లేకుండా కొత్త జీవో తీసుకువచ్చేందుకు ఫైలు సిద్ధం చేసింది.
మంత్రుల హోదా అనే పదం లేకుండా జీవో జారీ చేయడంతోపాటు పార్లమెంటరీ కార్యదర్శులకు బదులు అసెంబ్లీ సెక్రెటరీ, లేదా సీఎం రిప్రజెంటేటివ్స్ పేరుతో ఈ పదవులను కొనసాగించాలని యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ కొత్త నియామకాల వివరాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.