విద్యుత్‌ భారం తగ్గినట్లే! 

State Electricity Distribution Company to reduce electricity charges - Sakshi

ఎత్తిపోతల పథకాల కరెంటు చార్జీలు తగ్గించాలని ఈఆర్సీని కోరిన డిస్కంలు

యూనిట్‌ ధరను రూ.6.40 నుంచి రూ. 4.88కి కుదించాలని ప్రతిపాదన

ఈఆర్సీ ఒప్పుకుంటే 19 లిఫ్టులపై 3,284 కోట్లు తగ్గనున్న చార్జీల వ్యయం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాగునీటి ఎత్తిపోతల పథకాలకు సరఫరా చేసే విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ)ని కోరాయి. ప్రస్తుతం రూ. 6.40గా ఉన్న యూనిట్‌ చార్జీని రూ. 4.88కు తగ్గించాలని ప్రతిపాదించాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు డిస్కంలు గత వారం ఈఆర్సీకి విన్నవించాయి. మార్చిలోగా ఈ సిఫారసులను ఈఆర్సీ ఆమోదించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తయితే వాటి నిర్వహణకు ఏటా దాదాపు 12 వేల మెగావాట్ల విద్యుత్‌ అవసరం కానుండగా వాటికి ప్రస్తుత చార్జీలే వర్తిస్తే రూ. 13,824 కోట్ల వ్యయం కానుంది. ఒకవేళ చార్జీల తగ్గింపునకు ఈఆర్సీ అనుమతిస్తే చార్జీల వ్యయం ఏకంగా రూ. 3,284 కోట్లు తగ్గి రూ. 10,540 కోట్లకే విద్యుత్‌ చార్జీల భారం పరిమితం కానుంది. 

ఏటా పెరుగుతున్న వినియోగం.. 
రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తయిన/కొనసాగుతున్న 19 ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా 58.78 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును అందుబాటులోకి తేవడంతోపాటు మరో 8.45 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొత్తం ఎత్తిపోతల పథకాలు నిర్వహణలోకి వస్తే 11,495 మెగావాట్ల మేర విద్యుత్‌ అవసరం కానుంది. అయితే ప్రస్తుతం అలీసాగర్, గుత్పా, ఉదయ సముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్దేశిత ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతోంది. నీటిని తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాజెక్టు పరిధిలో పంపు మోటార్లు, వాటికి అనుగుణంగా విద్యుత్‌ అవసరాలను గుర్తించారు. ప్రస్తుతం 14 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తుండగా వీటికై 1,359 మెగావాట్ల మేర విద్యుత్‌ వినియోగం జరుగుతోంది. ఈ వినియోగం ఈ ఏడాది జూన్‌–జులై నాటికి 3,331 మెగావాట్లకు పెరగనుండగా 2018–19కల్లా 5,869 మెగావాట్లకు, 2019–20కల్లా 8,369 మెగావాట్లకు, 2020–21కల్లా 10,089, 2021–22కల్లా 11,495 మెగావాట్లకు పెరగనుంది. విద్యుత్‌ అవసరం పెరుగుతుండటం, దానికి తగట్లే యూనిట్‌కు రూ. 6.40పైసల మేర చెల్లించాల్సి ఉండటంతో నీటిపారుదలశాఖపై విద్యుత్‌ భారం పెరగనుంది. ఈ నేపథ్యంలో యూనిట్‌పై వసూలు చేస్తున్న చార్జీని రూ. 4.50 పైసలకు తగ్గించాలని డిస్కంలను కోరింది. అయితే దీనిపై ఈఆర్సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో డిస్కంలు ఈ మేరకు ఈఆర్సీ ముందు ప్రతిపాదనలు పెట్టాయి. యూనిట్‌ చార్జీ తగ్గింపు అవసరాన్ని ఈఆర్సీ ముందు బలంగా వాదించేందుకు నీటిపారుదలశాఖ ప్రత్యేకంగా ఓ కన్సల్టెంట్‌ను సైతం నియమిస్తోంది. దీనికితోడు తగ్గింపు అంశంపై ఈఆర్సీ ముందు తొలిసారి పిటిషన్‌ కూడా దాఖలు చేయనుంది. సాధారణంగా డిస్కంలు చేసిన ప్రతిపాదనలను ఈఆర్సీ యథావిధిగా ఆమోదిస్తుందని, ఆ దృష్ట్యా ప్రస్తుత చార్జీల తగ్గింపు ప్రతిపాదన సైతం ఆమోదం పొందుతుందని విద్యుత్‌శాఖ వర్గాలు చెబుతున్నాయి. 


Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top