వివాదాలపై ఢిల్లీలో 28న భేటీ


హాజరుకానున్న రెండు రాష్ట్రాల సీఎస్‌లు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు అంశాల్లో నెలకొన్న వివాదాలను పరిష్కరించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 28వ తేదీన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మతో పాటు సంబంధిత కేంద్ర శాఖల ఉన్నతాధికారులతో.. హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం, కృష్ణా నదీ యాజమాన్య మండలి ఆదేశాలను అమలు చేయకపోవడం తదితర అంశాలను ఈ భేటీలో కేంద్రం దృష్టికి తీసుకురానున్నట్లు ఏపీ సీఎస్ కృష్ణారావు శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. సాగర్ నుంచి కృష్ణా జలాలను డెల్టాకు విడుదల చేయడంలో టీ సర్కారు అవలంబించిన వైఖరిని కూడా వివరించనున్నట్లు చెప్పారు.

 

  ప్రధానంగా.. ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ సంస్థకు చెందిన ఉమ్మడి నిధులు రూ.35 కోట్లను ఏపీకి చెప్పకుండా బదిలీ చేసుకుందని, ఇది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం నిబంధనల స్ఫూర్తికి విరుద్ధమని వివరించనున్నారు. అదే సమయంలో.. కార్మిక సంక్షేమ నిధికి సంబంధించిన నిధులను ఏపీ ప్రభుత్వం జనాభా నిష్పత్తి మేరకే బదలాయింపు చేసిందని, అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంలో అనుచితంగా వ్యవహరించడమే కాకుండా కార్మిక శాఖ కమిషనర్‌ను పోలీసులతో ప్రశ్నింపజేసి కేసు కూడా నమోదు చేయించడాన్ని గోస్వామి దృష్టికి తేనున్నారు. అలాగే ఉమ్మడి సంస్థలకు చెందిన నిధులను స్తంభింపజేయాల్సిందిగా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయడాన్నీ, హైదరాబాద్‌లో పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడటాన్ని ప్రస్తావించనున్నారు.

 

 విడిగా హక్కుల కమిషన్, లోకాయుక్త..

 ఇలా ఉండగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏ షెడ్యూల్‌లోనూ లేని మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త, ఉప లోకాయుక్త, సమాచార హక్కు కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘంను విడిగా ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top