సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య విధాన పరిషత్ విభాగాలలో 1,196 స్టాఫ్ నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. వీటి భర్తీకి ఆరు నెలల క్రితమే అనుమతినిచ్చినప్పటికీ అర్హతలు, ఇతర నిబంధనల విషయంలో అస్పష్టత నేపథ్యంలో సెప్టెంబర్‌లో మరోసారి నిబంధనలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్టాఫ్ నర్సు అర్హుల నుంచి వైద్య, ఆరోగ్య శాఖకు పలు విజ్ఞప్తులు వచ్చాయి.
పోస్టులను భర్తీ చేయక చాలాకాలం అవుతున్న నేపథ్యంలో వయోపరిమితి విషయంలో సడలింపులు ఇవ్వాలని కోరారు. ఈ విజ్ఞప్తులను పరిశీలించిన వైద్య, ఆరోగ్య శాఖ వయోపరిమితి పెంపుపై ప్రతిపాదనలు రూపొందించింది. స్టాఫ్ నర్సుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వరకు ఉంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వ పరంగా పోస్టుల భర్తీ చేయకపోవడంతో వయోపరిమితిని పెంచాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు ఉండాలని ప్రతిపాదనలో పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రతిపాదనలు పంపింది. సీఎం ఆమోదం అనంతరం భారీగా నర్సుల పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేయనుంది.
స్టాఫ్ నర్సు వయోపరిమితి పెంపు
Oct 19 2017 12:50 AM | Updated on Oct 19 2017 12:50 AM
Advertisement
Advertisement