ట్రైనీ పోలీసులకు ప్రత్యేక డైట్‌

Special Diet For Trainee Police In Telangana - Sakshi

అందరికీ మాస్కులు, శానిటైజర్లు, సి–విటమిన్‌ ట్యాబ్లెట్లు

శిక్షణ కేంద్రాల్లో కట్టుదిట్టంగా భౌతిక దూరం

లీవుల్లేవు.. అత్యవసరమై వెళ్లినా 14 రోజుల క్వారంటైన్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కోరలు చాపుతున్న వేళ పోలీసు శిక్షణ కేంద్రాలు అప్రమత్తమయ్యాయి. శిక్షణలో ఉన్న పోలీసులకు అధికారులు ప్రత్యేకమైన డైట్‌ ఇస్తున్నారు. లీవులన్నీ రద్దు చేశారు. అకాడమీల్లో ఔటింగ్‌లను పూర్తిగా రద్దు చేశారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే.. అది కూడా ప్రాణాపాయం, మరణాలు వంటి అత్యవసర పరిస్థితుల్లోనే అనుమతిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటం, దేశమంతా లాక్‌డౌన్‌ విధించడంతో జిల్లాల్లో శిక్షణ పొందుతున్న అన్ని పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీల్లోనూ ట్రైనీల ఆరోగ్యరీత్యా పలు చర్యలు చేపట్టారు. ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకంగా మాస్కులు, శానిటైజర్లు ఇస్తున్నారు. శిక్షణ సమయంలో కూడా భౌతిక దూరం తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, ట్రైనీ పోలీసులకు రోగనిరోధకశక్తి పెంపొందించేందుకు స్పెషల్‌ డైట్‌ ఇస్తున్నారు. ప్రత్యేకంగా సి–విటమిన్‌ మాత్రలతోపాటు నారింజ, బత్తాయి, పైనాపిల్‌ పండ్లను కూడా ఇస్తున్నారు.

సెలవు తీసుకుంటే క్వారంటైన్‌ తప్పనిసరి..
లాక్‌డౌన్‌ నేపథ్యంలో పీటీసీల్లో సెలవులు ఎప్పుడో రద్దు చేశారు. మరీ అత్యవసరమైన వారికి మాత్రమే ఇస్తున్నారు. ఒకవేళ అలా వెళ్లొచ్చిన నేపథ్యంలో వారు 14 రోజులు తప్పకుండా క్వారంటైన్‌లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాల్సిందే. కొత్త వ్యక్తులను లోపలికి రానీయడంలేదు. పోలీసు శిక్షణ పొందుతున్న ప్రతీ ట్రైనీ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించేందుకు 24 గంటలు వైద్య సి బ్బం దిని అందుబాటులో ఉంచారు. ట్రైనీ క్యేడెట్ల ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధతో పకడ్బ ందీగా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

డీజీపీ ఆదేశిస్తే కరోనా విధుల్లోకి..
2018లో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ) 18 వేలకుపైగా పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో 12 మంది ఎస్సైలు, 17 వేల మంది కానిస్టేబుల్‌ పోస్టులున్నాయి. ఎస్సైలకు ఇప్పటికే సగం శిక్షణ పూర్తయింది. ఈ జనవరిలో దాదాపు 12 వేలమందికిపైగా కానిస్టేబుళ్లకు కూడా తరగతులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం 13 వేలమందికిపైగా శిక్షణ పొందుతున్నారు. ఇటీవల జరిగిన మేడారం జాతర విధులకు ట్రైనీ ఎస్సైలు హాజరయ్యారు. నాలుగైదు రోజులపాటు వీరంతా విధులు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అత్యవసరమైతే.. అందులోనూ డీజీపీ నుంచి ఆదేశాలు వస్తేనే.. శిక్షణ సిబ్బందిని వినియోగించే అవసరాన్ని పరిశీలిస్తామని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top