నగర భద్రతకు పెద్దపీట

Special Budget For Hyderabad Police Department - Sakshi

కమాండ్‌ అండ్‌కంట్రోల్‌సెంటర్‌కు రూ.125 కోట్లుఈ ఏడాది

చివరి నాటికిఅందుబాటులోకి సేవలు

 సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడానికిరూ.50 కోట్లు

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ నిర్మాణానికిచాన్స్‌

3 కమిషనరేట్లకు కలిపిరూ.329 కోట్ల ప్రగతి పద్దు

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో నగర భద్రతకు పెద్దపీట వేసింది. ఆ కోణంలోనే నిధుల కేటాయింపు చేసింది. బంజారాహిల్స్‌లో నిర్మాణమవుతున్న కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కమ్‌ టెక్నాలజీ ప్యూజన్‌ సెంటర్‌కు రూ.125 కోట్లు కేటాయించింది. దీంతో పాటు మూడు కమిషనరేట్లలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రూ.50 కోట్లు కేటాయించింది. రాష్ట్ర పోలీసు విభాగానికి ప్రగతి పద్దు కింద రూ.672 కోట్లు కేటాయింగా... దీని నుంచి రాజధానిలోని మూడు కమిషనరేట్లకే రూ.329 కోట్ల కేటాయింపు జరిగింది. అయితే.. రాజధానిలో నిర్మాణంలో ఉన్న పోలీసుస్టేషన్లకు మాత్రం నామమాత్రపు కేటాయింపులతో మొండిచేయి చూపింది. 

డేగ‘కళ్ల’ కోసం రూ.50 కోట్లు...
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో విస్తరించి ఉన్న నగరం మొత్తాన్ని సీసీ కెమెరా నిఘాలో ఉంచడానికి ప్రభుత్వం, పోలీసు విభాగం ముమ్మర కసరత్తు చేస్తోంది. మూడు కమిషనరేట్లలోనూ కలిపి పది లక్ష సీసీ కెమెరాల ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. శరవేగంగా నడుస్తున్న ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌లోనే రూ.69 కోట్లు కేటాయించింది. 2017–18లో రూ.225 కోట్లు ఇచ్చింది. 2018–19ల్లో ఈ బడ్జెట్‌లో రూ.147.5 కోట్లు కేటాయించింది. ఇదే ప్రాజెక్టుకు తాజాగా రూ.50 కోట్లు కేటాయించింది. మరోపక్క ముగ్గురు కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఇప్పటికే అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా సంఖ్య రెండు లక్షలకు చేరుతోంది. స్మార్ట్‌ అండ్‌ సేఫ్‌ సిటీ ప్రాజెక్టు కింద మూడు కమిషనరేట్లలో అవసరమైన పబ్లిక్‌ ప్లేసుల్లో కెమెరాలు ఏర్పాటు, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో వీటి కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ప్రభుత్వం  నిధులు సమకూర్చింది.  

ఇతర కేటాయింపులు ఇలా...
నగర ట్రాఫిక్‌ విభాగానికి: రూ.2.56 కోట్లు
గణేష్‌ ఉత్సవాల నిర్వహణకు: రూ.6.14 కోట్లు
నగర నేర పరిశోధన విభాగానికి: రూ.12 లక్షలు
కమ్యూనిటీ పోలీసింగ్‌కు: రూ.5 లక్షలు
ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు: రూ.10 కోట్లు
టెక్నాలజీ సమీకరణకు: రూ.10 కోట్లు
సైబరాబాద్‌ ట్రాఫిక్‌కు: రూ.2.22 కోట్లు
సైబరాబాద్‌ గణేష్‌ ఉత్సవాలకు: రూ.28 లక్షలు
సైబరాబాద్‌లో కమ్యూనిటీ పోలీసింగ్‌కు: రూ.15 లక్షలు
రాచకొండ గణేష్‌ ఉత్సవాలకు: రూ.2.05 కోట్లు
టెక్నాలజీ సమీకరణకి: రూ.4 కోట్లు

ఐసీసీసీ ఏర్పాటుకు కీలక అడుగు..
బంజారాహిల్స్‌లోని ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న టెక్నాలజీ ప్యూజన్‌ సెంటర్‌గా ఉండే సిటీ పోలీసు కమిషనరేట్‌ హెడ్‌– క్వార్టర్స్‌ అండ్‌ ఇంటిగ్రేడెట్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (హెచ్‌సీపీసీహెచ్‌క్యూ అండ్‌ ఐసీసీసీ) దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి దీన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.125 కోట్లు కేటాయించింది. ఈ భవనానికి సీఎం కేసీఆర్‌ 2015 నవంబర్‌ 22న శంకుస్థాపన చేశారు. నగర ప్రజల భద్రతే ప్రామాణికంగా ఎన్విరాన్‌మెంట్‌ ఫ్రెండ్లీగా అందుబాటులోకి రానున్న ఈ పోలీస్‌ ‘ట్విన్‌ గ్లాస్‌ టవర్స్‌’ నిర్మాణానికి మొత్తం రూ.1002 కోట్లు నిర్మాణ వ్యయమవుతుందని అప్పట్లో అంచనా వేశారు. 2015లోనే రూ.302 కోట్లు మంజూరు చేయగా... 2016–17 బడ్జెట్‌లో మరో రూ.140 కోట్లు కేటాయించారు. 2017– 18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.145 కోట్లు కేటాయించింది. 2018–19లో రూ.280.8 కోట్లు కేటాయింపు జరిగింది. గత ఏడాది ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేకపోవడంతో పూరిత చేయడం ఆలస్యమైంది. తాజాగా రూ.125 కోట్లు కేటాయించడంతో ఈ ఏడాది చివరి నుంచి దీని సేవలు ప్రారంభంకావడానికి మార్గం సుగమమైంది. 

రాష్ట్రానికే తలమానికం...
దేశంలోనే ప్రతిష్టాత్మకంగా, ‘ట్విన్‌ టవర్స్‌’ పేరుతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న హెచ్‌సీపీసీహెచ్‌క్యూ అండ్‌ ఐసీసీసీ రాష్ట్రానికే తలమానికం కానుంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఏడెకరాల సంస్థలో ఈ జంట భవనాలను 83.4 మీటర్ల ఎత్తులో నిర్మితమవుతున్నాయి. వీటి ద్వారా పోలీసు సింగిల్‌ విండో, కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సిస్టం, సిటిజన్‌ పిటిషన్‌ మేనేజ్‌మెంట్, క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ సిస్టం, లా అండ్‌ ఆర్డన్‌ సిస్టం, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం, బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ఒకే గొడుగు కిందికి రానున్నాయి. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సిస్టంలో భాగంగా డయల్‌– 100, అంబులెన్స్, ఫైర్స్, మహిళా భద్రత, షీ టీమ్స్, హాక్‌ ఐ... ఈ వ్యవస్థలన్నీ ఒకే చోటకు చేరతాయి. దీంతో అత్యవసర సమయాలతో పాటు బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా తక్షణం స్పందించేలా కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ ఉండనుంది. జీపీఎస్‌ పరిజ్ఞానం ఉన్న వాహనాలతో పాటు ఆస్పత్రులు, బ్లడ్‌ బ్యాంకులతో అనుసంధానమైన వ్యవస్థ ఇది.  

‘రాచకొండ’ నిర్మాణం ఇక షురూ..
సైబరాబాద్‌ నుంచి విడిపడి, నల్లగొండలో ఉన్న భువనగిరి, చౌటుప్పల్‌ తదితర ప్రాంతాలను తనలో కలుపుకొంటూ ఏర్పడిందే రాచకొండ పోలీసు కమిషనరేట్‌. 2016లో ఆవిర్భవించిన ఈ కమిషనరేట్‌ 5091.48 చదరపు కి.మీ విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్దదిగా మారింది. దీనికంటూ ప్రత్యేకంగా కమిషనరేట్‌ భవనం లేకపోవడంతో గతంలో గచ్చిబౌలిలో ఉన్న సైబరాబాద్‌ కమిషనరేట్‌లో కొన్నాళ్లు కొనసాగింది. ఆపై నేరేడ్‌మెట్‌లోని తాత్కాలిక భవనం నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. కమిషనరేట్‌ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటానికి దీని పరిధిలోని అనువైన ప్రాంతంలో ప్రత్యేక కమిషనరేట్‌ అవసరం ఉందని భావించిన సర్కారు మేడిపల్లిలో 56 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ప్రస్తుతం ప్రహరీ నిర్మానంలో ఉండగా... ఈ బడ్జెట్‌లో రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు ప్రగతి పద్దు కింద దీని నిర్మాణానికి రూ.62.95 కోట్లు కేటాయించింది. దీంతో భవన నిర్మాణం ప్రారంభం కావడానికి మార్గం సుగమమైంది.  

ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి..
నగర భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే బంజారాహిల్స్‌లో నిర్మితమవుతున్న కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు రూ.125 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి దీన్ని పూర్తి చేసి సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం భారీగా కేటాయింపు జరిగింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 60 శాతం తెలంగాణలోనే ఉన్నాయి. ఈ కేటాయింపుల్ని సద్వినియోగం చేసుకుని రాజధానిని ప్రథమ స్థానంలో నిలుపుతాం.   – అంజనీకుమార్, సిటీ కొత్వాల్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top