యుద్ధప్రాతిపదికన మొక్కల పెంపకం

Somesh Kumar Holds Review On Haritha Haram At BRK Bhavan - Sakshi

సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో పట్టణాల్లో హరితహారం నిర్వహణపై సమీక్ష జరిపారు. రాష్ట్రంలో అడవుల పునరుజ్జీవంతో పాటు ఆక్రమణలనుంచి కాపాడాలన్న సీఎం కేసీఆర్‌ విజన్‌ను అమలు చేయడానికి అధికారులు పచ్చదనం పెంపొందించడానికి పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 129 లొకేషన్ల లోని 188 ఫారెస్ట్‌ బ్లాక్‌లకు సంబంధించి 1.60 లక్షల ఎకరాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ నగరంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసించడానికి మొక్కలు నాటడానికి వీలున్న ప్రతీ చోట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను కోరారు.

జీహెచ్‌ఎంసీ ద్వారా కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మేనేజ్‌ మెంట్‌ కార్యక్రమం క్రింద చేపడుతున్న రోడ్లకు ఇరుప్రక్కల, శ్మశాన వాటికలు, పాఠశాలలు, చెరువులు, డ్రైన్‌ల వెంట నాటాలన్నారు. మెట్రో కారిడార్‌ల ఇరుప్రక్కలు, మీడియంలు, డిపోల వద్ద పచ్చదనం పెంపొందించాలన్నారు. హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎంఆర్‌ఎల్, అటవీ శాఖల ద్వారా అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ లలో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించారు.క్యాంపా నిధుల కింద అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ల అభివృద్ధికి గాను కేంద్రానికి పంపడానికి రూ.900 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ల కోసం క్యాంపా కింద ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఫారెస్ట్‌ బ్లాక్‌ల భూసమస్యల పరిష్కారం కోసం ఆర్డీఓ, డీఎఫ్‌ఓ, సంబంధిత ఏజెన్సీలతో ఫారెస్ట్‌ బ్లాక్‌ లెవల్‌ కమిటీని ఏర్పాటు చేసి వారంలోపు పరిష్కరించాలన్నారు. నాటే మొక్కల పురోగతిపై క్రమం తప్పకుండా సమీక్షించనున్నట్లు సీఎస్‌ తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top