కారణాలు చెప్పొద్దు..

Smita Sabarwal Who Examined The Water Treatment Plant At Japarpalli - Sakshi

గడువులోపు నీళ్లివ్వాలి

మిషన్‌ భగీరథ పనుల్లో వేగం పెంచాలి

సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్‌

జాపర్‌పల్లిలోని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పరిశీలన

పరిగి వికారాబాద్‌ :  ఎలాంటి కారణాలు చెప్పకుండా ఆగస్టు 15వ తేదీలోపు ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్‌ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 14లోపు భగీరథ పనులు పూర్తి చేసి, 15న నీటి సరఫరా ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ డెడ్‌లైన్‌ విధించిన నేపథ్యంలో.. జాపర్‌పల్లిలో నిర్మించిన వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను మంగళవారం ఆమె సందర్శించారు.

ఈ సందర్భంగా నీటి శుద్ధి ప్రక్రియలను పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులు, ఇంకా చేయాల్సిన వాటిపై పలువురు ఇంజినీర్లు ఆమెకు వివరించారు. పరిగి మండల జాపర్‌పల్లి, రాఘవాపూర్‌ నుంచి కొడంగల్‌ వరకు వేస్తున్న ప్రధాన పైప్‌లైన్‌ పనులను పరిశీలించారు.

సమన్వయంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ సీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ ఆంజనేయులు, ఆర్డీఓ విశ్వనాథం, తహసీల్దార్‌ అబీద్‌అలీ, స్థానిక డీఈ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 

సమన్వయంతో సాగండి.. 

కొడంగల్‌ రూరల్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకంలో కాంట్రాక్టర్లు, అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ నిర్దేశిత సమయానికి పనులు పూర్తి చేయాలని చర్యలు
తీసుకోవాలని సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్‌ ఆదేశించారు. 23 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మండల కేంద్రం సమీపంలో నిర్మిస్తున్న నీటి శుద్ధి కేంద్రాన్ని, పైప్‌లైన్‌ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పరిగి సమీపంలోని జాపర్‌పల్లి(రాఘవాపూర్‌) 39 కి.మీ. నుంచి రా వాటర్‌ సరఫరా అవుతుందని, గ్రావిటీ లేకుండా నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లోని 216 గ్రామాలకు నీటి సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరిగి నుంచి కొడంగల్‌కు వేసిన పైప్‌లైన్లలో లకేజీలు ఉన్నాయని, కూలీల సమస్య ఉందని పలువురు అధికారులు ఆమెకు వివరించారు.

పెండింగ్‌లో ఉన్న రూ.7 కోట్ల బిల్లులను మూడు రోజుల్లో విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కూలీల కొరతపై అసహనం వ్యక్తంచేస్తూ అదనంగా.. ఒక్కో బ్యాచ్‌లో 5గురు చొప్పున 47 బ్యాచ్‌లను ఏర్పాటుచేసుకొని సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగష్టు 15వ తేదీ లోపు 216 గ్రామాలకు నీరందించేలని అధికారులను ఆదేశించారు.   

బీమాపై అవగాహన కల్పించండి... 

రైతుబంధు, బీమాపై అవగాహన కల్పించాలని సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్‌.. ఆర్‌డీఓ వేణుమాధవ్‌కు సూచించారు. డివిజన్‌ పరిధిలో పరిష్కారం కాని పాస్‌పుస్తకాలు, చెక్కుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో వీఆర్‌ఓలు రైతులకు అవగాహన కల్పిస్తూ రైతుబంధు, బీమా వివరాలను తెలియజేయాలని చెప్పారు. భూవివాదాల కారణంగా నిలిచిన పాస్‌బుక్కులు, చెక్కుల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతులకు న్యాయం చేయాలన్నారు.

మిషన్‌ భగీరథ ప్రాంతంలో మొక్కలను నాటాలని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ ఈఈ పద్మలత, ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి, సీఈ చెన్నారెడ్డి, ఆర్‌డీఓ వేణుమాధవ్, సీఈ శ్రీనివాస్‌రెడ్డి, వికారాబాద్‌ ఈఈ నరేందర్, తహసీల్దార్‌ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top