‘అహోబిలం’ ప్రాజెక్టును నిలిపివేయండి

SK Joshi letter to Central Water Resources department - Sakshi

కేంద్ర జల వనరులశాఖకు సీఎస్‌ ఎస్‌కే జోషి లేఖ

సాక్షి, హైదరాబాద్‌: తుంగభద్ర నదీ జలాలను వాడుకుంటూ ఏపీ చేపట్టిన పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని నిలిపి వేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్‌ ఎస్‌కే జోషి కేంద్ర జలవనరుల శాఖను కోరారు. దిగువనున్న తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్మాణాన్ని ఆపేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని విన్నవించారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలోని రాజోలిబండ మళ్లింపు పథకం పూర్తిగా తుంగభద్ర జలాలపై ఆధారపడి ఉందన్నారు.

ఇక కృష్ణా ప్రవాహాలకు తుంగభద్ర ప్రధాన నీటి వనరని , కృష్ణా జలాలపై రాష్ట్రంలో కల్వకుర్తి ఎత్తిపోతల, ఏఎంఆర్‌పీ, ఎస్‌ఎల్‌బీసీ, నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వతో పాటు హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తుంగభద్ర నుంచి 40 టీఎంసీల నీటిని తీసుకుంటూ ఏపీ అనంతపురం నీటి అవసరాల కోసం పెన్నా అహోబిలం రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టిందని, దీనివల్ల దిగువనున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తెలిపారు. ఇదే విషయమై మంగళవారం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు లేఖ రాసిన సంగతి తెలిసిందే.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top