మటన్‌ రూ.700కు మించి అమ్మితే కఠిన చర్యలు

Serious Action Will Be Taken For Selling Meat More Than Government Rate Says Talasani - Sakshi

పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌

అధికారులను ఆదేశించిన మంత్రి తలసాని

సాక్షి, హైదరాబాద్‌: ఇష్టానుసారంగా వ్యవహరించి గొర్రెల ధరలను పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. శనివారం పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రతో కలిసి చెంగిచెర్ల, జియాగూడ, బోయగూడ మండీల్లో లైసెన్స్‌ మొండెదార్లు (గొర్రెల విక్రయదారులు)తో సమావేశం నిర్వహించారు. ప్ర భుత్వం నిర్ణయించిన ధర రూ.700 మించి విక్రయిస్తే శాఖాపరంగా కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతోనే పశుసంవర్థక శాఖ అధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించామని తెలిపారు. దీంతో మొండెదార్లు అందరూ లాక్‌డౌన్‌ కారణంగా తాము ఎక్కువ లాభాలు ఆశించకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు. అలాగే గొర్రెలను కేవలం మాంసం దుకాణాల నిర్వాహకులకే అమ్ముతామని, మద్య దళారులకు గొర్రెలను విక్రయించబోమని మంత్రికి విన్నవించారు. సమావేశంలో తనిఖీ బృందం డిప్యూటీ డైరెక్టర్‌ వెంకట సుబ్బారావు, డాక్టర్‌ బాబుబేరి, సింహా రావు, సుభాష్, నిజాం, మొండెదార్లు గౌలిపుర ప్రకాశ్, హోమర్, పి.లక్ష్మణ్, రాజు మల్తూకర్, కమల్‌ ప్రకాశ్, భగీరథ్, శ్రీనివాస్, రషీద్‌ తదితరులు పాల్గొన్నారు.

పీపీ విధానంతో చేపల మార్కెట్‌!
మత్స్య ఫెడరేషన్‌ ద్వారా కాని, ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో కానీ హోల్‌ సేల్‌ చేపల మార్కెట్‌ను నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని, ఇందుకు సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని పశుసంవర్థక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. చేపల ధరలు నియంత్రణలో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, ఆ శాఖ కమిషనర్‌ సువర్ణ, అధికారులతో మత్స్య శాఖ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల కారణంగా లాక్‌డౌన్‌లోనూ సమృద్ధిగా చేపలు లభ్యం అవుతున్నాయన్నారు. ముషీరాబాద్‌ (రాంనగర్‌)లోని హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌ వారంలో మూడు రోజులు పని చేస్తుందని, ఈ మార్కెట్‌కు 80 నుంచి 90 మెట్రిక్‌ టన్నుల చేపలు వస్తున్నాయని, దీంతో నగర ప్రజల అవసరాల మేరకు చేపలు లభిస్తున్నాయని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన మత్స్యకారులు అందరికీ అందేలా చూడాలని అన్నారు. 33 జిల్లాల వారీగా జిల్లా మత్స్య పారిశ్రామిక సహకారం సంఘం పాలకవర్గం ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top