వేర్వేరుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్లు: జగదీశ్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

వేర్వేరుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్లు: జగదీశ్‌రెడ్డి

Published Sat, Nov 4 2017 1:49 AM

Separately SC and ST Commissions: jagadeesh reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని, దీనిపై సలహాలు, సూచనల కోసం కేంద్ర ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికి కేంద్రం నుంచి ఇంకా సమాధానం లేదని ఇంధన, షెడ్యూల్డు కులాల అభివృద్ధి మంత్రి జగదీశ్‌రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటు అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు.

అయితే మంత్రి చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, మూడున్నర ఏళ్లుగా కాలయాపన చేస్తోంæదని నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు జానారెడ్డి, కిషన్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. దీంతో విపక్షాల తీరుపై మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2010 నుంచి ఎస్సీ కమిషన్‌ వేయలేదన్న విషయాన్ని సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు.

2010 నుంచి మంత్రివర్గంలో ఉన్న వారే ఇప్పుడు వాకౌట్‌ చేయడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీల విషయంలో కాంగ్రెస్‌ సభ్యుల తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. బీజేపీ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ కమిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. ఇంకా కేంద్రం నుంచి సమాధానం లేదన్నారు. ఏ అనుమతి కోరినా కేంద్రం కాలయాపన చేస్తోందన్నారు.  

Advertisement
Advertisement