నోట్స్‌ రాయలేదని

Senior students attack on a junior student - Sakshi

జూనియర్‌ విద్యార్థిపై సీనియర్‌ విద్యార్థుల దాడి

గౌడవెళ్లిలోని హితం ఇంజనీరింగ్‌ కళాశాలలో ర్యాగింగ్‌ భూతం

క్యాంటీన్‌లో చిన్న గొడవేనన్న కళాశాల యాజమాన్యం

మేడ్చల్‌: నోట్స్‌ రాయలేదనే కారణంగా జూనియర్‌ విద్యార్థిపై సీనియర్‌ విద్యార్థులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్‌ మండలం గౌడవెళ్లి గ్రామ పరిధిలోని హితం ఇంజనీరింగ్‌ కళాశాలలో బుధవారం ఈ ఘటన జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నగరానికి చెందిన ఓ విద్యార్థి హితం ఇంజనీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ మొదటి సంవత్సరం చదవుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం కొంతమంది సీనియర్‌ విద్యార్థులు తమ నోట్స్‌ రాసిపెట్టాలని జూనియర్‌కు హుకుం జారీ చేశారు. పరీక్షలు దగ్గరపడుతున్నందున తాను చదుకోవాలని, ఎవరి నోట్స్‌ను తాను రాయనని జూనియర్‌ సమాధానమిచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన సీనియర్‌ విద్యార్థులు జూనియర్‌ను కళాశాల క్యాంటీన్‌కు రప్పించి వెకిలి చేష్టలతో ర్యాగింగ్‌ చేశారు. జూనియర్‌ ఎదురుతిరగడంతో అతనిపై దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం ఇద్దరినీ పిలిచి మందలించి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది. గురువారం కొంతమంది మీడియాకు ఈ ఘటనపై సమాచారం ఇచ్చారు.

ర్యాగింగ్‌ కాదు.. చిన్న గొడవ
తమ కళాశాలలో ఎలాంటి ర్యాగింగ్‌ ఘటనా జరగలేదని, ర్యాగింగ్‌ నిరోధానికి తాము గట్టి చర్యలు తీసుకున్నామని హితం కళాశాల ప్రతినిధి మిజాబ్‌ తెలిపారు. బుధవారం కళాశాల క్యాంటీన్‌లో జూనియర్‌ విద్యార్థికీ, సీనియర్‌ విద్యార్థులకూ మధ్య చిన్న గొడవ జరిగిందని, ఇద్దరితో మాట్లాడి విషయాన్ని సెటిల్‌ చేశామని తెలిపారు. కాగా, హితం కళాశాలలో ర్యాగింగ్‌ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top