పట్టాలెక్కని సెమీ హైస్పీడ్‌ కారిడార్‌

Semi Hispeed Train Project Delayed - Sakshi

2.5 ఏళ్ల క్రితమే రష్యన్‌ రైల్వేస్‌తో ఒప్పందం

రైల్వే కారిడార్‌ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం

నివేదిక అందజేయని   రష్యన్‌ సంస్థ

పూర్తయితే గంటకు 200 కి.మీ. వేగంతో ట్రైన్‌ సదుపాయం

సాక్షి, సిటీబ్యూరో: దక్షిణమధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన మరో ప్రాజెక్టు పై కూడా నీలినీడలు  కమ్ముకున్నాయి. ఏళ్లకు ఏళ్లుగా కేవలం కాగితాలకే  పరిమితమవుతున్న అనేక ప్రాజెక్టుల  తరహాలోనే  సెమీహైస్పీడ్‌  కారిడార్‌  సైతం  సర్వేలకే పరిమితమైంది. మొదటి దశలో  హైదరాబాద్‌  నుంచి  నాగ్‌పూర్, రెండో దశలో న్యూఢిల్లీ వరకు  సెమీ హైస్పీడ్‌  కారిడార్‌ నిర్మించేందుకు  నాలుగేళ్ల  క్రితమే  ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం  న్యూ ఢిల్లీ–వారణాసి  మధ్య ప్రవేశపెట్టిన  ‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ తరహాలోనే  హైదరాబాద్‌–నాగ్‌పూర్‌ నగరాల మధ్య సెమీ హైస్పీడ్‌ రైలు నడిపేందుకు  రష్యన్‌ రైల్వేస్‌తో అధ్యయన ఒప్పందంకుదుర్చుకున్నారు.

దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాన రైల్వే హబ్‌గా  ఉన్న  హైదరాబాద్‌ నుంచి సుమారు  584 కిలోమీటర్ల దూరంలో  ఉన్న  నాగ్‌పూర్‌ వరకు  సెమీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఏర్పాటు సాధ్యా సాధ్యాలపై రష్యన్‌ రైల్వే  నిపుణులు  సమగ్రమైన  సర్వేలు  నిర్వహించి  నివేదికను  అందజేయాల్సి ఉంది. అయితే రెండున్నరేళ్లు గడిచినా  ఇప్పటి వరకు  దక్షిణమధ్య రైల్వేకు ఎలాంటి నివేదికలు  అందలేదు. ఇప్పటికీ ప్రాజెక్టు అధ్యయన దశలోనే  ఉందని  దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి  ఒకరు పేర్కొన్నారు. ఓ వైపు న్యూ ఢిల్లీ–వారణాసి మధ్య సెమీ హైస్పీడ్‌ రైలు పరుగులు తీస్తుండగా,  హైదరాబాద్‌–నాగ్‌పూర్‌ కారిడార్‌పై ఎలాంటి కదలిక లేకపోవడం, రెండేళ్లు దాటినా  అధ్యయనం, సర్వేల  దశను  అధిగమించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుత పరిణాల నేపథ్యంలో  ఈ  ప్రాజెక్టుపైన సందిగ్ధం నెలకొంది.

పెరగనున్న వేగం...
ప్రస్తుతం  హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంటనగరాల నుంచి నాగ్‌పూర్‌ మీదుగా 22 ఎక్స్‌ప్రెస్‌  రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ  మార్గంలోనే  హైదరాబాద్‌–న్యూ ఢిల్లీ మధ్య రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దక్షిణాది నుంచి ఉత్తరాదికి  వెళ్లే  ఈ ప్రధాన మార్గంలో  సెమీహైస్పీడ్‌ రైళ్లను ప్రవేశపెట్టడం వల్ల  ప్రయాణ సమయం  చాలా వరకు తగ్గిపోయి, ప్రయాణికులకు  మరింత మెరుగైన, నాణ్యమైన సదుపాయాలను అందజేసేందుకు  అవకాశం లభిస్తుందని  భావించారు. ట్రాక్‌లపైన రద్దీ, ఒత్తిడి  కారణంగా  ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం  ఇప్పుడు గంటకు 80 నుంచి  100 కిలోమీటర్లు మించడం లేదు. పలు ప్రాంతాల్లో రైళ్ల వేగం పూర్తిగా మందగిస్తోంది. ప్రయాణికుల రైళ్లతో పాటు, సరుకు రవాణా రైళ్లకు కూడా ఒకే ట్రాక్‌ ఉండడం వల్ల  ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేకంగా  హైస్పీడ్‌ కారిడార్‌లను అభివృద్ధి చేసేందుకు గతంలోనే ప్రతిపాదనలు రూపొందించారు.

హైదరాబాద్‌–నాగ్‌పూర్‌తో పాటు, ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–కోల్‌కత్తా, ఢిల్లీ–వారణాసి, ఢిల్లీ–అమృత్‌సర్, చెన్నై–బెంగళూర్, తదితర మార్గాలను గుర్తించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నుంచి ఏపీ రాజధాని అమరావతి వరకు  కూడా హైస్పీడ్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉంది. మొత్తం 10 మార్గాల్లో  హైస్పీడ్‌ కారిడార్లను  ప్రతిపాదించినప్పటికీ  ప్రస్తుతం  న్యూ ఢిల్లీ–వారణాసి  మాత్రమే అందుబాటులోకి  వచ్చింది. దక్షిణాదిలో  మొదట  హైదరాబాద్‌–నాగ్‌పూర్‌ కారిడార్‌ పూర్తిచేయాలనే  ప్రతిపాదన ఉన్నప్పటికీ  ఇంకా సర్వేల దశలోనే  ఉండడం గమనార్హం. ఈ మార్గంలో సెమీ హైస్పీడ్‌  అందుబాటులోకి వస్తే  ఈ  రైళ్లు గంటకు  160 నుంచి  200 కిలోమీటర్ల పైగా  వేగంతో దూసుకుపోతాయి. అతి తక్కువ సమయంలో  గమ్యం చేరుకోవచ్చు. హైదరాబాద్‌–నాగ్‌పూర్‌ అనంతరం ఢిల్లీ వరకు కూడా సెమీ హైస్పీడ్‌ అందుబాటులోకి వస్తే  ప్రస్తుతం ఉన్న ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి న్యూ ఢిల్లీకి  తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే  ఉన్నాయి. మరో 10 రైళ్లు వివిధ మార్గాల్లో హైదరాబాద్‌ మీదుగా న్యూ ఢిల్లీకి రాకపోకలు సాగిస్తున్నాయి. సగటున  29 గంటల నుంచి  30 గంటల వరకు సమయం పడుతుంది. సెమీ హైస్పీడ్‌ వల్ల ఈ సమయం సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top