సెల్ఫీ సోకు.. ప్రాణం మీదకు తెచ్చుకోకు..

Selfie Deaths Increasing In Nizamabad - Sakshi

ప్రమాదకరంగా ఫొటోలు దిగుతున్న యువత

లైకుల కోసం ఆరాటం

ప్రాణాల మీదకు తెస్తున్న మోజు

గతంలో గోన్‌గొప్పులలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

ఎక్కడ చూసినా, ఎవర్ని చూసినా సెల్ఫీ సెల్ఫీ. స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉంటే చాలు తిన్నా, పడుకున్నా, దగ్గినా, తుమ్మినా, నవ్వినా, ఏడ్చినా సందర్భం ఉన్నా లేకున్నా సరే సెల్ఫీలకు ఫోజులిస్తున్నారు నేటి జనం. ఎక్కడ ఉండి సెల్ఫీ దిగుతున్నామన్న ఆలోచన లేకుండా ఎక్కడ బడితే అక్కడ దిగేస్తున్నారు. లైకుల కోసం ఆరాట పడుతూ ప్రమాదకరమైన చోట్ల సెల్ఫీలు దిగేందుకు సాహసం చేస్తున్నారు. ఇలా ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతూ ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

సాక్షి, రామారెడ్డి(నిజామాబాద్‌) : యువతలో ఇటీవల కాలంలో సెల్ఫీల మోజు విపరీతంగా పెరిగింది. ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో కొత్తగా కనిపించేందుకు, లైకుల కోసం సాహసాలు చేస్తూ ఫొటోలు దిగుతున్నారు. చెరువులు, వాగులు, నదులు, కొండ లు, గుట్టలు, రైళ్లు తదితర చోట్ల ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతూ ప్రాణాపాయం కొనితెచ్చుకుంటున్నారు. విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటూ తమ కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు.  

రోజురోజుకీ పెరుగుతున్న మోజు 
యువత రోజురోజుకీ సెల్ఫీల మోజులో పడి కొట్టుకుపోతోంది. కూర్చుంటే సెల్ఫీ. నిలబడితే సెల్ఫీ, హోటల్‌కు వెళ్లినా, ప్రయాణంలో ఉన్నా.. ఇలా ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇలా సెల్ఫీలు దిగి వెంటనే సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. దీనివల్ల సమయం వృధా తప్ప భారీ నష్టంలేదు. కానీ కొందరయితే కొండలు, గుట్టలు, నదులు, నడుస్తున్న రైళ్లు, సాహస కృత్యాలు చేస్తూ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో సెల్ఫీలు దిగుతున్నారు. ఇలాంటి ప్రయత్నాల్లో ప్రాణాలు పోగొట్టు కుంటున్నారు. ప్రాణం అంటే లెక్కలేనితనం వెనక్కి తగ్గితే పక్కన ఉన్నవారు వెక్కిరిస్తారేమోనన్న చిన్నతనంతో యువత ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. యువతలో సాహసం చేయాలనే తపన ఉండడం సహజం. అది అవసరమే అయినప్పటికీ, పది మందికి ఉపయోగపడేలా ఉండాలి. చావు బతుకుల్లో ఉన్న వారిని అపాయంలో ఉన్న వారిని రక్షించడానికి ప్రాణాలకు తెగించి సాహసాలు చెయవచ్చు. కానీ కేవలం ఒక ఫొటో కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అవివేకం. 

సందర్భం ఏదైనా సెల్ఫీ గోలే.. 
నేటి సమాజంలో స్మార్ట్‌ ఫోన్ల రాకతో ఫొటోల గోల ఎక్కుపోతుంది. సందర్భంగా ఏదైనా సరే ఫొటో దిగాల్సిందే. వాట్సప్‌లో స్టేటస్‌ పెట్టాల్సిందే. ఇది ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి అధికారుల వరకు నేడు సాగే ట్రెండ్‌. ఒక కార్యక్రమం నిర్వహిస్తే ఎంత మంది అధికారులు, ఎంత మంది నాయకులు ఉంటారో అంతమంది ఒక ఫొటో దిగాల్సిందే. ఈ సెల్ఫీల గోల యువత నుంచి వయస్సు మళ్లిన వారికి పాకింది. దీంతో వారు కూడా  సందర్భం ఏదైనా సెల్ఫీ మోజులో పడిపోతున్నారు. 

గతంలో జిల్లాలో ఓ యువకుడి మృతి
భీమ్‌గల్‌ మండలం గోన్‌గొప్పులకు చెందిన ఇందపురపు దినేశ్‌(22) గతేడాది సెప్టెంబర్‌ 26వ తేదీన కప్పల వాగు చెక్‌డ్యాం వద్ద సెల్ఫీ దిగుతూ నీటి పడిపోయాడు. నీటి ఉధృతిలో కొట్టుకుపోయాడు. గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని రప్పించారు. వారు వచ్చి గాలింపు చర్యలు చేపట్టగా రెండు రోజుల అనంతరం మృతదేహం లభ్యమైంది. 

సెల్ఫీల మోజు బాగా పెరిగింది 
సాంకేతికతను పరిజ్ఞానం పెంచుకోవడానికి వినియోగించుకోవాలి. అతిగా సెల్‌ఫోన్‌ వినియోగంచడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. ఇక యువతకు సెల్ఫీ మోజు బాగా పెరిగింది. సెల్ఫీ మోజులో ఎక్కడపడితే అక్కడ ఫొటోలు దిగుతున్నారు. దీంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 
– నిజాం, ప్రిన్సిపాల్, రామారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

తల్లిదండ్రులు నియంత్రించాలి 
అనవసరమైన వయస్సులో పిల్లలకు సెల్‌ఫోను ఇవ్వకూడదు. యువత ఫోన్లను విపరీతంగా వాడుతోంది. 
సరదా కోసం తీస్తున్న సెల్ఫీలు చివరకు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. 
–గోవర్ధన్‌రెడ్డి, హెచ్‌ఎం ఉప్పల్‌వాయి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top