రేపటి నుంచి విత్తన కార్పొరేషన్ల సదస్సు

Seed cooperation conference from tomorrow - Sakshi

హైబ్రిడ్‌ విత్తనోత్పత్తిపై దృష్టిసారించాం: పార్థసారథి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థను బలోపేతం చేస్తామని ఆ సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వర్‌రావు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 6, 7 తేదీల్లో జరగనున్న వివిధ రాష్ట్రాల విత్తన కార్పొరేషన్ల సదస్సును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. బుధవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్‌ డాక్టర్‌ ఎం.జగన్‌మోహన్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్‌ ద్వారా విత్తనోత్పత్తి చేపట్టడంతో పాటు పరిశోధనలు, మార్కెటింగ్‌ సౌకర్యాలను విస్తృత పరచుకోనున్నట్లు తెలిపారు. విత్తన సదస్సుకు మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్‌ రాష్ట్రాల విత్తన కార్పొరేషన్లతో పాటు జాతీయ విత్తన కార్పొరేషన్, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రతినిధులు రానున్నారని వెల్లడించారు.

సదస్సులో ఆయా రాష్ట్రాలు రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. మార్కెటింగ్, విత్తనోత్పత్తికి పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ముగింపు సదస్సులో మంత్రి తుమ్మల పాల్గొంటారన్నారు. పార్థసారధి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం నుంచి పంపిణీ చేసే విత్తనాలకు టెండర్‌ విధానం లేకుండా మన రాష్ట్రంలోనే హైబ్రిడ్‌ విత్తనోత్పత్తి చేపట్టే చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అనేక పరిశోధన కేంద్రాలు ఉన్నాయని, వీటన్నింటిని వినియోగించుకుని విత్తనోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు విదేశాలకు, ఇతర దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

నకిలీ విత్తన నిరోధానికి చట్టం తీసుకురావాలనుకున్నప్పటికీ, ఈ అంశం కేంద్రం పరిధిలో ఉండటం, జాతీయ స్థాయిలో నూతన విత్తన చట్టం తీసుకువచ్చే సూచనలు కనిపించడంతో ఆ విధానానికి అనుగుణంగా ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top