ప్రభు.. కరుణించేనా..? | save me god | Sakshi
Sakshi News home page

ప్రభు.. కరుణించేనా..?

Feb 25 2015 2:05 AM | Updated on Oct 8 2018 5:04 PM

రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అయిన మహబూబ్‌నగర్‌కు కేంద్ర రైల్వే బడ్జెట్‌లో ప్రతి ఏడాదీ రిక్తహస్తమే ఎదురవుతోంది.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అయిన మహబూబ్‌నగర్‌కు కేంద్ర రైల్వే బడ్జెట్‌లో ప్రతి ఏడాదీ రిక్తహస్తమే ఎదురవుతోంది. జిల్లానుంచి ప్రాతి నిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వెళ్తున్న ప్రతిపాదనలు బుట్టదాఖలవుతున్నాయి. ఫలక్‌నుమా మార్గం డబ్లింగ్, విద్యుదీకరణ, దేవరకద్ర-మునీరాబాద్ మార్గానికి నిధులు, గద్వాల- మాచర్ల రైలుమార్గం ప్రతిపాదనలకు మోక్షం లభించడం లేదు.
 
 నిధులు విడుదలైనా రోడ్డు బ్రిడ్జిల నిర్మాణం ముందుకు సాగడం లేదు. రైల్వే ప్రాజెక్టులు చేపట్టేం దుకు అవసరమైన భూసేకరణతో పాటు ప్రాజెక్టు వ్యయంలో 50శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలనే నిబంధన కూడా రైలు  మార్గాల అభివృద్ధికి ఆటంకంగా మారింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే రూ.8లక్షల కోట్లు విలువ చేసే రైల్వే ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు 25 ఏళ్లు పడుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది.
 
 ఈ నేపథ్యంలో కొత్త మార్గాలకు ఆమోదం తెలపడం అనుమానంగానే కనిపిస్తోంది. జిల్లాలో 191 కిలోమీటర్ల రైలు మార్గం ఉండగా ప్రతిరోజూ ప్రయాణికులతో 54 రైళ్లు పరుగులు తీస్తున్నాయి. సుమారు అంతే సంఖ్యలో గూడ్సు రైళ్లు సరుకులను రవాణా చేస్తున్నాయి. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్  పరిధిలో మహబూబ్‌నగర్ అతి పెద్ద రైల్వే స్టేషన్. ప్రతి నెలా సుమారు కోటి రూపాయలు జిల్లా నుంచి రైల్వేకు ఆదాయం సమకూరుతోంది. ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర మంత్రి సురేశ్‌ప్రభు ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్ ప్రతిపాదనలపై జిల్లా ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు.
 
 పట్టాలెక్కని గద్వాల- మాచర్ల
 కర్ణాటకలోని రాయిచూర్ నుంచి గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, నల్లగొండ జిల్లా దేవరకొండ మీదుగా మాచర్ల వరకు గతంలో నూతన రైల్వే లైనును ప్రతిపాదించారు. 1981లో అప్పటి నాగర్‌కర్నూలు ఎంపీ మల్లు అనంతరాములు ప్రతిపాదన మేరకు సర్వే కూడా జరిగింది. మొదటి దశలో భాగంగా రాయిచూరు నుంచి గద్వాల వరకు 59 కిలోమీటర్ల మేర రైల్వే లైను నిర్మాణం పూర్తయింది. మిగతా పనులు చేపట్టే అంశం ఏటా ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. రెండేళ్లుగా జిల్లా ఎంపీలు ఈ లైను నిర్మాణంపై ప్రతిపాదనలు సమర్పిస్తున్నా రైల్వేబడ్జెట్‌లో ప్రస్తావనకు నోచుకోవడం లేదు. బెంగళూరు, ముంబై, సోలాపూర్ తదితర ప్రాంతాలను జిల్లాతో అనుసంధానించే అతి దగ్గరి రైల్వే మార్గం గద్వాల- రాయిచూర్. అయితే లైను నిర్మాణం పూర్తయినా కేవలం రాయిచూర్ వరకు మాత్రమే డెమో రైలు నడుస్తోంది.
 
 కలగా ఫలక్‌నుమా డబ్లింగ్
 మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ మీదుగా ప్రతి రోజు ఎక్స్‌ప్రెస్, సూపర్ ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్లతో కలుపుకొని 54 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సింగిల్ లైను ఉండటం, ఎలక్ట్రిఫికేషన్ పూర్తి కాకపోవడంతో జిల్లా మీదుగా ప్రయాణించేందుకు ప్రయాణీకులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
 
  క్రాసింగ్ పేరిట రైళ్లను నిలిపివేస్తుండటంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. రైల్వే స్టేషన్లలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణం మరింత నరకప్రాయమవుతోంది. రద్దీవేళల్లో మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్ స్టేషన్‌లలో టికెట్ కౌంటర్ల వద్ద రద్దీతో ప్రయాణీకులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఫలక్‌నుమా నుంచి మహబూబ్‌నగర్ వరకు రైల్వే లైను డబ్లింగ్ కోసం 2009-10 బడ్జెట్‌లో సర్వే కోసం రూ.5 కోట్లు మంజూరయ్యాయి. సర్వే పూర్తయినా డబ్లింగ్ కోసం నిధులు మంజూరు కావడం లేదు.
 
 ఆర్‌ఓబీలు నత్తనడక
 జిల్లాలో 101 రైల్వే క్రాసింగులకు గాను గత యేడాది జూలై వరకు 60చోట్ల మాత్రమే గేట్లకు కాపలా ఉంది. సమీప గ్రామాల ప్రజలు ఈ క్రాసింగుల మీదుగా ప్రతీరోజూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పట్టాలు దాటుతున్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట స్కూలు బస్సు ఘటన నేపథ్యంలో ఆరు నెలల కాలంలో చాలాచోట్ల యుద్ధప్రాతిపదికన అండర్ బ్రిడ్జిలు, కాపలా గేట్లు ఏర్పాటు చేశారు. కాగా కాపలా వుండే గేట్ల వద్ద రద్దీని దృష్టిలో పెట్టుకుని పట్టాల మీదుగా రోడ్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు. అప్పన్నపల్లి, గద్వాల, జడ్చర్ల, దేవరకద్ర రైల్వే క్రాసింగ్‌ల వద్ద రోడ్డ ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం, భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వాంలు గతంలో నిధులు కూడా మంజూరు చేశాయి. అయితే రూ.22కోట్ల వ్యయంతో చేపట్టిన అప్పన్నపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగి ఇటీవలే ప్రారంభానికి నోచుకుంది. 2008లో నిధులు మంజూరైనా జడ్చర్లలో నేటికీ పనులు ప్రారంభం కాలేదు. దేవరకద్రలో ఇప్పుడిప్పుడే సన్నాహాలు ప్రారంభించగా, గద్వాలలో పిల్లర్ల స్థాయిలో పనులు జరుగుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement