సర్పంచ్‌ సోదరుడి దారుణ హత్య

Sarpanch Brother Died In Mahabubnagar - Sakshi

రూ.7.68 లక్షల నగదుతో వస్తుండగా దాడిచేసిన దుండగులు 

కర్ణాటక సరిహద్దులోని యానగుంది సమీపంలో ఘటన 

సాక్షి, దామరగిద్ద (నారాయణపేట): డబ్బులతో ద్విచక్రవాహనంపై వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సీఐ సంపత్‌కుమార్‌ కథనం ప్రకారం.. మండలంలోని నర్సాపూర్‌ గ్రామ సర్పంచ్‌ వీరప్ప సోదరుడు కొమ్మూరు నారాయణ (26) కర్ణాటక రాష్ట్రం గుర్మిట్కల్‌లో బియ్యం వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గుర్మిట్కల్‌లోని నరేందర్‌ అనే వ్యక్తికి బియ్యం విక్రయించగా వచ్చిన డబ్బులు తీసుకువచ్చేందుకు బుధవారం నర్సాపూర్‌ నుంచి ద్విచక్రవాహనం పై వెళ్లాడు. అక్కడ నరేందర్‌ దగ్గర బియ్యం విక్రయించగా వచ్చిన డబ్బుల సంబంధించి రూ.7.68 లక్షల చెక్కు తీసుకున్నాడు.

చెక్కు గుల్బర్గా బ్యాంకుకు సంబంధించినది కావడంతో నేరుగా డబ్బులు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి గుల్బర్గా వెళ్లాడు. బ్యాంకులో చెక్కు డ్రా చేసుకొని నగదుతో గుర్మిట్కల్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. సాయంత్రం 4.30 గంటలకు తన భార్యకు ఫోన్‌ చేసి గుల్బర్గా నుంచి డబ్బులు తీసుకొని వస్తున్నట్లు చెప్పాడు. సాయంత్రం 6.40 గంటల ప్రాంతంలో తన చిన్న సోదరుడు వెంకటప్ప ఫోన్‌ చేయగా గుర్మిట్కల్‌ నుంచి బయలుదేరినట్టు చెప్పాడు. అయితే 7.30 గంటల వరకు కూడా ఇంటికి రాకపోవడంతో మళ్లీ ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. 

రాత్రంతా వెతికినా.. 
నారాయణ ఎంతకూ ఇంటికి రాకపోవడం, ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ ఉండటంతో ఆందో ళన చెందిన సోదరులు సర్పంచ్‌ వీరప్ప, వెంకటేష్, బుగ్గప్పలు రహదారిపై ఎక్కడైనా ప్రమాదం జరిగిందేమోనని భావించి రాత్రంతా వెతికినా ఎక్కడా ఆచూకీ కనిపించలేదు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున కాన్‌కుర్తి శివారులో రహదారిపై రక్తపు మరకలు కనిపించడంతో చుట్టు పక్కల వెతకగా పొదల్లో నారాయణ మృతదేహం లభ్యమైంది. విగతజీవిగా మారిన తమ సోదరుడిని చూసి అన్నదమ్ములు గుండెలు బాదుకున్నారు. డబ్బుల కోసం యువకుడిని దారుణంగా హత్య చేసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. నారాయణకు గత 45 రోజుల క్రితమే దౌ ల్తాబాద్‌ మండలం కుదురుమల్లకు చెందిన ఓ యువతితో వివాహమైంది.

కాన్‌కుర్తి శివారులో శవమై..
ద్విచక్రవాహనంపై వస్తుండగా యానాగుంది సరిహద్దులోని కాన్‌కుర్తి శివారులో గల ఎర్రగుట్ట సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని రోడ్డుకు దూరంగా ఉన్న పొదల్లో పడేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ద్విచక్రవాహనాన్ని సైతం రోడ్డుకు దూరంగా పొలంలో పడేశారు. ఈ ఘటనపై మృతుడి నారా యణ సోదరుడు వెంకటప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమారం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ చేతన పరిశీలించారు. ఆమె వెంట సీఐ సంపత్‌కుమార్‌తోపాటు స్థానిక ఎస్‌ఐ రాంబాబు ఉన్నారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top