స్పష్టమైన హామీ ఇస్తేనే...: సంగీత

 Sangeetha seeking Justice Infront Of Her husband srinivas reddy house - Sakshi - Sakshi - Sakshi

ఐదో రోజు కూడా భర్త ఇంటి ఎదుటే దీక్ష చేస్తున్న సంగీత

హామీ ఇచ్చేవరకూ ఆందోళన కొనసాగిస్తా

సాక్షి, హైదరాబాద్‌ ‌: తనకు న్యాయం చేయాలంటూ సంగీత చేస్తున్న దీక్ష గురువారానికి ఐదోరోజుకు చేరింది. బోడుప్పల్‌లోని భర్త శ్రీనివాస్‌ రెడ్డి ఇంటి వద్దే ఆమె ఆందోళన కొనసాగిస్తోంది. తనకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ ఆందోళన కొనసాగుతుందని సంగీత స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో సంగీత భర్త శ్రీనివాస్‌ రెడ్డి, మరిది శ్రీధర్‌ రెడ్డి, అత్త, మామలు ఐలమ్మ, బాల్‌రెడ్డిలను  పోలీసులు  బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కాగా మామ బాల్‌రెడ్డి, మరిది శ్రీధర్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు కాగా, అత్త ఐలమ్మకు న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది. ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు.

కాగా అమ్మాయి పుట్టిందనే నెపంతో తనను ఇంటి నుంచి గెంటేసి  మరో మహిళను  పెళ్లి చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డిని, అందుకు  ప్రోత్సహించిన అతని తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని కోరుతూ  గత అయిదు రోజులుగా  సంగీత బోడుప్పల్‌లోని అత్తగారింటి వద్ద ఆందోళన చేస్తోంది. ఈ  క్రమంలో  భర్త శ్రీనివాస్‌రెడ్డి ఆమెపై దాడికి సైతం పాల్పడ్డాడు. అప్పటికే  మొదటి భార్య స్వాతి నుంచి విడాకులు తీసుకున్న శ్రీనివాస్‌ రెడ్డి  సంగీతను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెను  ఇంటి నుంచి గెంటేసి దేవీ జగదీశ్వరీ అనే మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో సంగీత న్యాయపోరాటానికి దిగింది. ఆమెకు పలు మహిళా, ప్రజాసంఘాలు మద్ధతుగా నిలిచాయి. మంత్రి  కేటీఆర్‌   సూచన మేరకు  మల్కాజిగిరి  ఎంపీ మల్లారెడ్డి సైతం బుధవారం  బాధితురాలిని పరామర్శించి దీక్షకు మద్ధతు పలికారు. ఈ క్రమంలో  ఆమె అత్తింటి వారితోనూ, బంధువులతో ఆయన జరిపిన చర్చలు విఫలం కావడంతో సంగీత భర్త, అత్త,మామల ను పోలీసులు అరెస్టు చేశారు. వారి అరెస్టులతో తనకు న్యాయం జరిగినట్లుగా భావించడం లేదని, సామాజికంగా, ఆర్ధికంగా తనకు భద్రత కల్పించాలని సంగీత కోరారు. అప్పటి వరకు ఆందోళన కొనసాగించనున్నట్లు  పేర్కొన్నారు.  

హోటల్‌లో చర్చలు..
సంగీతకు మద్ధతు తెలిపిన  ఎంపీ మల్లారెడ్డి  ఆమెకు  ప్రభుత్వం అన్ని విధాలుగా  అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం ఆయన తన అనుచరులతో కలిసి సంగీత అత్తింటి వారితో  మేడిపల్లిలోని ఒక హోటల్‌లో  చర్చలు జరిపా రు.  సంగీత తరుపున రాపోలు రాములు, తోటకూర జంగయ్య, సంగీత బాబాయి చర్చల్లో పాల్గొన్నారు. సంగీతకు పరిహారం, రక్షణ, జీవన భృతిపై చర్చలు జరిగాయి. అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో చర్చలు విఫలమయ్యాయి. దీనికితోడు సంగీతకు అన్ని వైపుల నుంచి మద్ధతు పెరగడంతో పరారీలో ఉన్న సంగీత అత్త పులకండ్ల ఐలమ్మ, మామ బాల్‌రెడ్డి, భర్త శ్రీనివాస్‌ రెడ్డిలను నిన్న సాయంత్రం పోలీసులు.... అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top