టార్గెట్‌ పైలట్‌!

sakshi special interview with Metro loco pilot Vennela - Sakshi

చిన్నప్పటినుంచీ విమానం ఎక్కాలంటే ఇష్టం

 మెట్రో లోకో పైలట్‌తో ముందడుగు

 వెన్నెలతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ

భూత్పూర్‌(దేవరకద్ర): చిన్నప్పటినుంచీ ఆకాశంలో ఎగరాలని కలలు కనేదాన్ని.. పైలట్‌గా ఉద్యోగం చేసి విమానం నడపాలని నా కోరిక. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి మెట్రో లోకో పైలట్‌గా ఓ అడుగు ముందుకేశాను..  నా చివరి టార్గెట్‌.. పైలట్‌.. ఆ లక్ష్యం చేరేదాక కృషి చేస్తూనే ఉంటా.. నని మెట్రో రైల్‌ లోకో పైలట్‌ వెన్నెల అన్నారు. సోమవారం స్వగ్రామమైన అమిస్తాపూర్‌కు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ వెన్నెలతో ఇంటర్వ్యూ నిర్వహించింది.

చిన్నప్పటినుంచి మా అమ్మానాన్న చదువు విషయంలో ఎంతో ప్రోత్సహించారు. వారి ఆశీస్సులు, అన్న సహకారంతో మెట్రో లోకో పైలట్‌గా ఉద్యోగం సంపాదించాను. క్రిష్టియన్‌ పల్లిలోని క్రీస్తు జ్యోతి విద్యాలయంలో 10వ తరగతి వరకు చదివాను. అనంతరం డిప్లామాలో  ఎలక్ట్రానిక్స్‌ స్పెషలైజేషన్‌ కోర్సు చేశాను.  

పత్రికల్లో చూసి దరఖాస్తు చేశా..
నా పేరు పక్కన మొదటినుంచీ పైలట్‌ అని ఉండాలని అనుకునేదాన్ని. ఆ కోరికను తీర్చుకోవడానికి ఎలక్ట్రానిక్స్‌ స్పెషలైజేషన్‌ కోర్సు పూర్తి చేశాను. తర్వాత ఈసీఐఎల్‌లో అంప్రెంటీస్‌ చేస్తుండగా ఓ పేపర్లో మెట్రో రైల్‌ నోటిఫికేషన్‌ చూశాను. దరఖాస్తు పూర్తిచేసి ఎంట్రెన్స్‌ రాశాను. ఇంకేముంది మంచి మార్కులు వచ్చాయి.. ట్రెనింగ్‌కు సెలక్టయ్యా ను. ఏడాదిన్నర పాటు శిక్షణ తీసుకున్నాను.

ఆ అనుభూతి మరిచిపోను
మెట్రో రైల్‌ ప్రారంభానికి ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఎందరో ప్రముఖులు వచ్చారు. వారిని అంత దగ్గరనుంచి చూడటం చాలా సంతోషం అనిపించింది. వారు వచ్చినప్పుడు నేను లోకో పైలట్‌ టీం మెంబర్‌గా ఉన్నందుకు ప్రౌడ్‌గా ఫీలయ్యాను. ఆ అనుభూతి మరిచిపోలేను.

మా బ్యాచ్‌లో  నేనే జూనియర్‌
లోకో పైలట్‌ టీంలో ఉన్న సభ్యుల్లో పోలిస్తే అందరిలో నేనే జూనియర్‌. అయినప్పటికీ మా టీం సభ్యులు నన్ను ఆ భావనతో చూడ లేదు. అన్ని విషయాల్లో ప్రోత్సహించారు. ప్రస్తుతం మెట్రో రైలులో నేను ఒక్కదాన్నే విధులు నిర్వహిస్తున్నా. రోజు నాగోల్‌ నుంచి అమీర్‌పేట్‌ వరకు నడుపుతున్నాను. వేలాదిమంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నానని  సంతోషంగా ఉంది.

క్రమశిక్షణే ఈ స్థానానికి చేర్చింది
మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: క్రమశిక్షణే వెన్నెలను ఉన్నత స్థానానికి చేర్చిందని జ యప్రకాష్‌ నారాయణ ఇంజనీరింగ్‌ కళాశాల చైర్మన్‌ కేఎస్‌ రవికుమార్‌ అన్నారు. మెట్రో రైలు నడుపుతున్న కళాశాల పూర్వవిద్యార్థి వెన్నెలను సోమవారం కళాశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ.. కష్టపడే తత్వం, పట్టుదల వంటి లక్షణాలు ప్రతి ఒక్కరినీ జీవితంలో విజయం సాధించేలా చేస్తాయన్నారు. అందుకు నిదర్శనం వెన్నెల అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ లింగన్‌గౌడ్‌ కులకర్ణి, కళా శాల పాలిటెక్నిక్‌ ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్, వెన్నెల తల్లిదండ్రులు వీరేశం, ఉమాదేశి, కుటుంబ సభ్యులు మహాదేవమ్మ, వినోద్‌కుమార్, విజయ, మంజుల, రాజశేఖర్‌ పాల్గొన్నారు.  

వెన్నెలకు ఘన సన్మానం
వెన్నెల స్వగ్రామానికి రావడంతో మహబూబ్‌నగర్‌ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారు సోమవారం ఘనంగా సన్మానించారు. ముందు బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం షాలువా, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. తెలంగాణ తొలి మెట్రో రైల్‌ను మా ప్రాంతానికి చెందిన యువతి ఆనందంగా ఉందని వారు కొనియాడారు. ఏయిర్‌లైన్‌ పైలెట్‌ కావాలన్న వెన్నెల లక్ష్యం నెరవేరాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సమితి సభ్యులు సీమ నరేందర్, ఎదిర ప్రమోద్‌ కుమార్, పీఈటీ రమేశ్, సతీష్, రాజశేఖర్, ప్రసాద్, సంజీవ్‌  ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top