జువెనైల్‌ హోం నుంచి  15 మంది బాలురు పరారీ

Saidabad Juvenile Home 15 Boys Escaped - Sakshi

ఒకరిని పట్టుకున్న పోలీసులు

విచారణకు ఆదేశించిన డైరెక్టర్‌ శైలజ 

హైదరాబాద్‌ : నగరంలోని సైదాబాద్‌ జువెనైల్‌ హోం నుంచి శనివారం అర్థరాత్రి 15 మంది బాలురు పారిపోయారు. గదిలోని కిటికీ ఇనుప చువ్వలను ఆక్సా బ్లేడ్, కట్టర్‌ సాయంతో కోసి కిందకు దిగి గోడ దూకి పారిపోయినట్లు జువెనైల్‌ అధికారులు చెబుతున్నారు. వీరికి బెయిల్‌ రావడంలో ఆలస్యం అవుతుండటంతో ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది. 13 మంది ఒక గ్రూపుగా ఇద్దరు ఒక గ్రూపుగా విడిపోయి పారిపోతున్న దృశ్యాలు బస్తీలోని సీసీ కెమెరా ఫుటేజీలో కనిపించాయి. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో వీరిపై ఐదేసి కేసులున్నట్లు జువెనైల్‌ అధికారులు చెబుతున్నారు.

అయితే, ఈ ఘటనపై జువెనైల్‌ అధికారులు సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పారిపోయిన వారిలో ఒకరిని పట్టుకున్నారు. ఈ మేరకు సైదాబాద్‌ ఎస్సై కాట్న సత్తయ్య ఆదివారం మీడియాకు తెలిపారు. మూడ్రోజుల క్రితం ఇదే హోం నుంచి ఐదుగురు బాలురు పారిపోగా అధికారులు వారిని వెదికి పట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇది జరిగి రెండ్రోజులు గడవకముందే తాజాగా బాలురు తప్పించుకోవటం వెనుక అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.  

జువెనైల్‌ హోంను పరిశీలించిన డైరెక్టర్‌ 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వీధి బాలల సంక్షేమశాఖ డైరెక్టర్‌ శైలజ ఆదివారం పరిశీలన గృహాన్ని పరిశీలించారు. అక్కడి హోం సూపరింటెండెంట్‌ నీల కంఠాధర్‌ను వివరాలు అడిగి తెలుసుకుని ఘటనపై విచారణకు ఆదేశించారు. దీనికి బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 

సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేయాలి 
ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి పరిశీలనగృహం సూపరింటెండెంట్‌ నీల కంఠాధర్‌ను సస్పెండ్‌ చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. పిల్లల వద్దకు ఆక్సా బ్లేడ్‌ వంటి పరికరాలు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. పిల్లలను సంస్కరించాల్సిన హోం యమపురిగా మారిందని ఆయన మండిపడ్డారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top