పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షల ఏర్పాటు

Sabitha Indra Reddy Orders Collectors Over Intermediate Board Exams - Sakshi

పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చూడండి

జిల్లా కలెక్టర్లకు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి తెలిపారు. పరీక్షలను సమర్ధవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మెరుగైన పద్ధతులను అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

పరీక్షలు ప్రతి రోజు ఉదయం 8:45 గంటల నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని, దానికి నోడల్‌ ఆఫీసర్‌ను నియమిస్తామన్నారు. ఏ సమస్య వచ్చినా 040–24601010, 040–24732369, 040–24655027 నెంబర్లలో సంప్రదించాలని, నోడల్‌ అధికారి పరిష్కరిస్తారన్నారు. పరీక్షల నిర్వహణ సజావుగా సాగేందుకు జిల్లా కలెక్టర్లు తగిన శ్రద్ధ వహించాలని ఆదేశించారు. çపరీక్షా కేంద్రాలన్నింటిలోనూ కనీస సౌకర్యాలు కల్పించాలని మంత్రి స్పష్టం చేశారు.

20లోగా నివేదిక ఇవ్వండి
జిల్లాల్లో ఇంటర్‌ పరీక్షల ఏర్పాట్లపై చెక్‌ లిస్టు ప్రకారం ఈనెల 20లోగా నివేదికలు అందజేయాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ కోరారు. ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలకు సరైన భద్రత కల్పించే విషయంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎస్పీలు పర్యవేక్షించాలన్నారు. 9,65,840 మంది విద్యార్థులు హాజరయ్యే ఈ ప రీక్షలకు 1,339 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో 50 ప్లయింగ్‌ స్క్వాడ్‌లు, 200 సిట్టింగ్‌ స్క్వాడ్‌లు, 24,750 మం ది ఇన్విజిలేటర్లు పాల్గొంటారన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇంటర్మీడియెట్‌ కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top