ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలి: మంత్రి

Sabita Indra Reddy Asks Donors To Adopt Govt Schools - Sakshi

‘సాక్షి’తో మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి

ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరందించడమే లక్ష్యం

కాళేశ్వరం స్ఫూర్తితో ‘పాలమూరు–రంగారెడ్డి’

అనంతగిరిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. 

సాక్షి, రంగారెడ్డి:  ‘ప్రాజెక్టులు పూర్తికావాలి.. బీడు భూముల్లో నీళ్లు పారి జిల్లా సస్యశ్యామలం కావాలి. పుష్కలంగా పంటలు పండి రైతులు సంతోషంగా ఉండాలి. ఇదే మా లక్ష్యం. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి జిల్లా వాసుల కలను నెరవేరుస్తాం’ అని విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్‌పై తనకు కొండంత విశ్వాసం ఉందని, కాళేశ్వరం స్ఫూర్తితో పాలమూరు–రంగారెడ్డిని కూడా పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రాతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణాన్ని మూడేళ్ల వ్యవధిలోనే పూర్తిచేశారని.. ఇదే తరహాలో ఇక్కడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తారని అన్నారు. ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సబిత మంగళవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.  

ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి.. 
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి కృషిచేస్తామని, పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు పరుస్తామన్నారు. బడుల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ కష్టంగా మారిందని, ఈ సమస్య పరిష్కారానికి ప్రముఖ కంపెనీలు, సంస్థలను సంప్రదించి వాటి సహకారం తీసుకుంటామన్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్‌) కింద నిధులను పాఠశాలల కోసం ఖర్చుచేసేలా వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌లు కూడా దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. అంతేగాక రియల్టర్లు, బిల్డర్లు కొన్ని పాఠశాలలను దత్తత తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. సమాజానికి ఎంతో కొంత చేయాలన్న దృక్పథం ప్రతిఒక్కరిలో ఉండాలన్నారు.   

త్వరలో సమీక్ష.. 
జిల్లాలో ప్రభుత్వ విభాగాల వారీగా సమీక్ష సమావేశాలను నిర్వహిస్తామని పేర్కొన్న మంత్రి.. వాటిలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామని తెలిపారు. అన్ని విభాగాల అధికారులతోపాటు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమీక్షకు హాజరయ్యేలా చూస్తానని అన్నారు. 

వీటిపైనా దృష్టి.. 
మ్యుచువల్లీ ఎయిడెడ్‌ ట్రిప్‌టైన్డ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ (ఎంఏటీసీఎస్‌) బ్యాంకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరలో పరిష్కారం చేస్తానని చెప్పారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు అధికంగా ఉన్నాయని, ఇక్కడికి ఐటీ, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి కంపెనీలో స్థానికులకు 20 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాల్సిందేనన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం విడుదల చేసిన జీఓ స్పష్టం చేస్తున్నా.. కొన్ని కంపెనీలు పాటించడం లేదన్నారు. జీఓ ప్రకారం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కేలా చూస్తానని పేర్కొన్నారు.   

అనంతగిరిని తీర్చిదిద్దుతాం
ఎత్తయిన గుట్టలు, పచ్చని చెట్లతో అలరారే అనంతగిరిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ విషయమై సీఎంతో ప్రత్యేకంగా మాట్లాడి కార్యరూపం దాల్చేందుకు చొరవ తీసుకుంటానని తెలిపారు. హైదరాబాద్‌ మహానగరానికి అత్యంత చేరువులో ఇంతటి సుందరమైన ప్రాంతం మరోటి లేదన్నారు. హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారి విస్తరణకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించేందుకు కృషిచేస్తామని సబిత అన్నారు. విస్తరణపై తాజాగా ఓ వ్యక్తి కేసు వేశారని, ఆయనతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. తాండూరు ప్రాంతంలో కంది బోర్డు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉందని, దానిని సాధిచేందుకు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సహకారం తీసుకుంటామని ఆమె చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top