ప్రమాదవశాత్తు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకరు గాయాలపాలైన సంఘటన సిద్దిపేట పట్టణంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
సిద్దిపేట రూరల్(మెదక్): ప్రమాదవశాత్తు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకరు గాయాలపాలైన సంఘటన సిద్దిపేట పట్టణంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానిక సాజిద్‌పురలోని మహ్మద్ గౌసుద్దీన్‌కు చెందిన భవనంలోని మూడో అంతస్తులో ఉంటున్న ఫరానాబేగం అలియాస్ రఫియాబేగం ఇంటికి ఆదివారం మధ్యాహ్నం కొత్త గ్యాస్ సిలిండర్ డెలివరీ అయింది. వంట చేసేందుకు ఆమె పొయ్యి వెలిగించగా గ్యాస్ లీకవుతూ మంటలు చెలరేగాయి.
దీంతో రఫియాబేగంతో పాటు ఇంట్లో ఉన్న వారు బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో రఫియా గాయపడింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న ఫైర్‌ఇంజన్‌తో మంటలు అదుపులోకి వచ్చాయి. అప్పటికే ఇంట్లోని సామగ్రి అంతా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంతో సుమారు రూ. 4లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యం వల్లే గ్యాస్ లీకైందని వారు అరోపిస్తున్నారు.