రాకాసి రహదారి

రాకాసి  రహదారి - Sakshi


► మృత్యుమార్గాలుగా జిల్లా రోడ్లు

►  ఏటేటా పెరుగుతున్న ప్రమాదాలు

►  అధికవేగం.. నిర్లక్ష్యమే కారణం

►  ఏడాదికి సరాసరి 950మంది మృతి

►  మృతుల్లో యువకులే అధికం..

►  పాఠాలు నేర్వని రవాణా, పోలీసుశాఖ


 

జిల్లా రహదారులు నెత్తురు చిందిస్తున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం వెరసి నిండుప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ముచ్చటగా మూడుపదులు నిండని వయస్సులోనే యువకులు విగతజీవులుగా మారుతున్నారు. ప్రమాదం జరిగిన చోట ముగ్గురు ఆపై చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇంత జరుగుతున్నా పోలీసు, రవాణా శాఖల అధికారులు పాఠాలు నేర్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

కొన్ని సంఘటనలు


యగతనెల 26న భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామానికి చెందిన నలుగురు అన్నదమ్ములు టాటాఏస్ వాహనంలో ఓ కేసు విషయమై ఆమనగల్లుకు వెళ్లొస్తున్నారు. జాతీయ రహదారిపై దివిటిపల్లి సమీపంలో వెనుకనుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో నలుగురూ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.



యజనవరి 27న అడ్డాకుల మండలం కొమిరెడ్డిపల్లి గ్రామశివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఇదే ప్రమాదంలో బెంగళూరుకు చెందిన భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు.



యగతేడాది జిల్లాకేంద్రానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్యాపిల్లలతో కలిసి దైవదైర్శనానికి వెళ్లి తిరుగుపయనమయ్యారు. అతివేగంతో వచ్చిన ట్రాక్టర్  ఢీకొనడంతో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది... ఇలాంటి ప్రమాదాలు జిల్లాలో రోజూ ఎక్కడో ఓ చోట కనిపిస్తూనే ఉన్నాయి.

 

మహబూబ్‌నగర్ క్రైం : రోడ్డుప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో యువకులే అధికంగా ఉన్నారని స్పష్టమవుతోంది. కేరింతలు.. వయస్సు పెట్టే గిలిగింతలు.. వెరసి అనర్థాలకు దారితీస్తోంది. మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, చిన్న వాహనాలపై ఇద్దరి నుంచి నలుగురు కూర్చోవడం, ఆటోల్లో సామర్థ్యానికి మించి తరలించడం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పిల్లలపై ఉన్న ప్రేమతో తల్లిదండ్రులు 18ఏళ్లు నిండకుండానే వాహనాలు కొనుగోలుచేసి ఇస్తున్నారు. రోడ్లపై దూకుడును ప్రదర్శించడంతో రోడ్డుప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.



ప్రమాదాలకు కారణాలివే..

 44వ జాతీయ రాహదారిపై రోడ్డు మధ్య ఉన్న డివైండర్ల ఎత్తు పెంచకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. అతివేగంగా వచ్చిన వాహ నాలు ఒక్కోసారి అదుపుతప్పి డివైండర్లను దాటి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టిన సంఘటనలు అనేకం ఉన్నాయి. గతంలో అడ్డాకుల మండలంలోని శాఖాపూర్ గ్రామశివారులో చోటుచేసుకున్న రోడ్డుప్రమాదం ఇలాంటిదే. డివైండర్ ఎత్తు తగ్గిపోవడంతో హైదారాబాద్ వైపునకు వెళ్తున్న వాహనం డివైడర్‌ను దాటుకుని కర్నూలు వైపునకు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలోనే ఎనిమిది మృతిచెందారు.



రోడ్డు ప్రమాదాలను నివారించడంతో జిల్లా పోలీసు యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. ఏటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్నా.. నివారణ చర్యలు చేపట్టడంతో పోలీసులు చొరవచూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ముగ్గురేసి,ఆటోల్లో పరిమితికి మించిన ప్రయాణికుల తరలింపు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడపడం వంటివి చేస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.



అధికారుల నిర్లక్ష్యం..

 ఓవర్‌లోడ్‌తో అతివేగంగా వెళ్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాల్సిన ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. 44వ జాతీయ రహదారిపై ప్రతిరోజు వేలసంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. ఇందులో ఓవర్‌లోడ్‌తో పాటు అతివేగంగా వెళ్తూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా ఆర్టీఓ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.



అధికలోడ్ ఉన్న వాహనాలను పట్టుకొని వారిచ్చే డబ్బులకు ఆశపడి వదిలేయడంతో అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలకు రక్షణలేకుండాపోతుంది. అతివేగాన్ని నిరోధిస్తూ జాతీయ రహదారితో పాటు ప్రధానపట్టణాల్లో స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటుచేయకపోవడం వంటి వాటిపై ఉదాసీనంగా వ్యవహరించడంతో రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయి.

 

జాగ్రత్తలు పాటిస్తే మేలు

 వాహనాలు నడిపే సమయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎదురుగా వచ్చేవారు కూడా జాగ్రత్తలు పాటించకపోతే న ష్టం తప్పదు. రవాణా శాఖ రూపొందించిన సూచనలు పాటిస్తే చాలావరకు ప్రమాదాలను నివారించవచ్చు.  డ్రైవింగ్ చేసే సమయంలో ‘వేగం కన్నా ప్రాణమే మిన్న’ అనే సూత్రాన్ని మదిలో ఉంచుకుంటే ప్రమాదాలకు చెక్‌పెట్టొచ్చు.మద్యం సేవించి ఎట్టి పరిస్థితిల్లోనూ వాహనాలు నడపరాదు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు వారి చదువులు పూర్తయ్యే వరకు ఎలాంటి వాహనాలు కొనివ్వకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

 - కృష్ణమూర్తి, మహబూబ్‌నగర్ డిఎస్పీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top