అర్చకులకు  తీపికబురు!

Retirement Age Of Priests CM KCR - Sakshi

జోగుళాంబ శక్తిపీఠం: ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. వారి పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అర్చకులు తమకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నప్పటికీ గతేడాది సెప్టెంబర్‌ 15న వేతనాల చెల్లింపు కోసం జీఓ నం.577ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో వేతనాల చెల్లింపుపై స్పష్టత ఉన్నప్పటికీ ఉద్యోగ విరమణ అనంతరం వృద్ధులైన అర్చకులు పింఛన్‌ పొందే విషయమై ఎలాంటి ఆదేశాలు పొందుపర్చలేదు.

గతంలో చాలీచాలని వేతనాలే కాకుండా ఉద్యోగ విరమణ పేరిట అలంపూర్‌కు చెందిన భీమసేనాచార్యులు అనే అర్చకుడికి రిటైర్డ్‌మెంట్‌ నోటీస్‌ ఇవ్వడంతో కుటంబాన్ని పోషించుకోలేని స్థితిలో చేసేదిలేక ఆత్మహత్యకు ఒడిగట్టాడు. ఇలాంటి పరిస్థితిలో కనీసం తమకు పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచమని అర్చకులు చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్‌ ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుని అర్చకుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇదే సందర్భంలో అర్చక, ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా నేరుగా ప్రభుత్వమే ప్రతినెలా 1వ తేదీన వేతనాలు చెల్లించేందుకు కీలక నిర్ణయం వెలువరించింది.
  
171 మంది అర్చకులకు లబ్ధి 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 6 ‘ఏ’ కేటాగిరీ కలిగిన ఆలయాల్లో 44 మంది అర్చకులు, 6 ‘బీ’ కేటాగిరీ 102 మందికి, 6 ‘సీ’ కేటాగిరీ ఆలయాల్లో 25 మంది చొప్పున మొత్తం కలిపి 171 మందికి పదవి విరమణ వయస్సు పెంపు ప్రయోజనం చేకూరనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాల చెల్లింపు ప్రక్రియలో భాగంగా వారం రోజులుగా అధికారులు 324 మంది కాంట్రాక్టు, ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తూ వారికి 2015 పీఆర్‌సీ ప్రకారం వేతనాల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించారు. అందులో భాగంగానే మూడురోజుల క్రితం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా కేవలం 31 మందికి మాత్రమే వారి వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలను జమచేశారు. నేడు మరో 189 మంది అర్చక, ఉద్యోగులకు వేతనాలు చెల్లించనున్నారు. మరో విడతలో మిగిలిన వారందరికీ 2015 పీఆర్‌సీ ప్రకారం వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.   

రుణపడి ఉంటాం.. 
ప్రభుత్వ వేతనాల చెల్లింపులతో పాటుగా పదవీ విరమణ వయస్సు 58 నుంచి 65కు పెంచడంతో  నా లాంటి వృద్ధాప్యంలో ఉన్న అర్చకులకు భరోసా కల్పించినట్లయింది. పింఛన్‌ లేని లోటును ఈ విధంగా తీర్చినందుకు అర్చకలోకం రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటుంది.  –వీరయ్య, మద్దిమడుగు దేవస్థానం అర్చకుడు, నాగర్‌కర్నూల్‌ జిల్లా    

ప్రభుత్వానికి కృతజ్ఞతలు 
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని రెండు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాలకు ఫలితం దక్కింది. ఈ సందర్భంగా వేతనాల చెల్లింపులపై చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు జిల్లా అర్చక, ఉద్యోగుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.  – జనుంపల్లి జయపాల్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా అర్చక, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top