23 ఏళ్ల తర్వాత ఇంటికి... | Renuka Return Home After 23years in Hyderabad | Sakshi
Sakshi News home page

23 ఏళ్ల తర్వాత ఇంటికి...

Nov 13 2018 8:42 AM | Updated on Nov 17 2018 1:47 PM

Renuka Return Home After 23years in Hyderabad - Sakshi

రేణుకను తల్లి యాదమ్మ, సోదరుడు వెంకటేష్‌లకు అప్పగిస్తున్న డీసీపీ అనురాధ, ట్రస్ట్‌ నిర్వహకురాలు పద్మావతి

కన్నవారి చెంతకు చేరిన రేణుక

రాజేంద్రనగర్‌: ఇంటి నుంచి వెళ్లిన 23 సంవత్సరాల అనంతరం ఓ మహిళ కుటుంబ సభ్యుల చెంతకు చేరింది. ఈ సంఘటన హైదర్షాకోట్‌ కస్తూర్బా ట్రస్టులో చోటు చేసుకుంది. మతి స్థిమితం లేని మహిళలకు పదేళ్ల చికిత్స తర్వాత ఒక్కొక్కటిగా చిన్ననాటి విషయాలు గుర్తుకు రావడంతో కస్తూర్బా ట్రస్ట్‌ నిర్వాహకురాలు పద్మావతి పోలీసుల సహాయంతో కుటుంబసభ్యులను వెతికి షీటీమ్‌ డీసీపీ అనురాధ సమక్షంలో సోమవారం వారికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్‌ గిరినగర్‌ ప్రాంతానికి చెందిన యాదమ్మ, సత్తయ్య దంపతులు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్తయ్య హెచ్‌ఏఎల్‌లో విధులు నిర్వహించగా యాదమ్మ ఇంటి వద్దే దుస్తు్తలు ఇస్త్రీ చేసేది. పెద్ద కూతురైన మసినూరి రేణుక(40) తల్లికి చేదోడు వాదోడుగా ఉండేది. వీరి ఇంటి పక్కనే తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం నివసించేంది. 1995లో రాత్రికి రాత్రే తమిళనాడు కుటుంబం రేణుకను తీసుకొని వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు రేణుక కోసం సంవత్సరాల తరబడి వెతికారు. ఇంటి నుంచి వెళ్లిన సమయంలో రేణుక 17 సంవత్సరాల వయస్సు. 

18 ఏళ్లుగా ఆశ్రమాల్లోనే..
2001లో చెన్నై రైల్వే స్టేషన్‌లో మతిస్థిమితం లేని రేణుకను అక్కడి పోలీసులు గుర్తించి బనియన్‌ ఆర్గనైజేషన్‌ సొసైటీకి అప్పగించారు. అప్పటి నుంచి అక్కడే ఆశ్రమం పొందుతోంది. హైదరాబాద్‌ నుంచి వచ్చాను అనే మాట తప్ప మరే ఇతర వివరాలు చెప్పలేదు. దీంతో నిర్వాహకులు 2011లో హైదరాబాద్‌కు వచ్చి వాకబు చేశారు. అనంతరం 2012 జూలై 20న బనియన్‌ ఆర్గనైజేషన్‌ వారు హైదర్షాకోట్‌లోని కస్తూర్బా ట్రస్టు నిర్వాహకులకు రేణుకను అప్పగించారు. ట్రస్టు నిర్వాహకులు చికిత్స అందిస్తూ ఆశ్రయం కల్పించారు. 10 రోజుల క్రితం కోలుకున్న రేణుక తాను ఉండే ప్రాంతం పేరుతో పాటు తండ్రి హెచ్‌ఏఎల్‌లో పని చేసేవాడని తనకు ఇద్దరు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారని, తల్లి బట్టలు ఇస్త్రీ చేసేదని తెలిపింది. 

పోలీసుల సాయంతో ఆచూకీ లభ్యం
చిన్ననాటి విషయాలన్ని ఒకొక్కటిగా చెబుతుండడంతో ట్రస్టు నిర్వహకురాలు పద్మావతి బాలానగర్‌ పోలీసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన అంగన్‌వాడీ వర్కర్లను సంప్రదించారు. స్థానికంగా ఇస్త్రీ బట్టలు చేసే వారి వివరాలు సేకరించింది. గిరినగర్‌ ప్రాంతంలో 23 ఏళ్ల క్రితం రేణుక తప్పిపోయిందని సమాచారం అందడంతో ట్రస్టు నిర్వహకులు ఆమె సోదరుడు వెంకటేష్‌ను సంప్రదించారు. వెంకటేష్‌ తన సోదరి పూర్తి వివరాలను ట్రస్టు నిర్వాహకులకు అందించాడు. సోమవారం మధ్యాహ్నం షీటీమ్‌ ఇన్‌చార్జి డీసీపీ అనురాధ సమక్షంలో రేణుక తల్లి యాదమ్మ, సోదరుడు వెంకటేష్‌లకు ఆమెను అప్పగించారు. రెండు దశాబ్దాల తర్వాత కూతురిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ట్రస్తు నిర్వాహకులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. రేణుక తాను తల్లితో ఇంటికి వెళ్తానని, ట్రస్ట్‌లోని సభ్యులంతా గుర్తుకు వస్తే వచ్చి చూసి వెళ్తానని చెప్పింది. అన్ని వివరాలు నమోదు చేసుకున్నాక పోలీసులు  రేణుకను కుటుంబసభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement