వాణిజ్యపన్నుల శాఖను మరింత బలోపేతం చేసేందుకు అంతర్గత సంస్కరణల దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ప్రతి జిల్లాకు సొంత భవనం.. జిల్లాకో డిప్యూటీ కమిషనర్
సాక్షి, హైదరాబాద్: వాణిజ్యపన్నుల శాఖను మరింత బలోపేతం చేసేందుకు అంతర్గత సంస్కరణల దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డిప్యూటీ కమిషనర్ స్థాయి నుంచి ఏసీటీవో వరకు పోస్టుల సంఖ్యను పెంచాలని యోచిస్తున్నట్లు ఉన్నత వర్గాల ద్వారా తెలిసింది. అలాగే ప్రతి జిల్లాలో వాణిజ్యపన్నుల శాఖకు సొంత భవనం ఏర్పాటు చేయడం, సర్కిళ్లను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో వాణిజ్యపన్నుల శాఖకు 12 డివిజన్‌లు ఉండగా, ఒక్కో డివిజన్‌కు సగటున 15 చొప్పున 200 వరకు సర్కిళ్లు ఉన్నాయి.
అయితే వీటిలో హైదరాబాద్ పరిధిలోనే 7 డివిజన్లు ఉండడం గమనార్హం. ఈ సర్కిళ్లలో లావాదేవీలు పెరిగిపోవడంతో పన్ను చెల్లించకుండా వ్యాపారాలు సాగిస్తున్న వారిపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మెదక్, ఖమ్మం, మహబూబ్‌నగర్ లో ప్రత్యేక డివిజన్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆదిలాబాద్ జిల్లాలో మం చిర్యాలను, కరీంనగర్‌లో రామగుండం, మెదక్‌లో సిద్ధిపేటను డివిజన్‌లుగా మార్చే ప్రతిపాదన ఉంది. హైదరాబాద్‌లో 4 డివిజన్లను పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం.
డీలర్లు వేలల్లో.. సర్కిళ్లు పదుల్లో...
ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలోని ఏడు డివిజన్లలోని ప్రతి సర్కిల్‌లోనూ 5 వేలకుపైగానే డీలర్లు ఉన్నారు. వీరి నుంచి సక్రమంగా పన్ను వసూలు చేయడమే గగనమవుతున్న పరిస్థితుల్లో పన్ను ఎగవేతదారులపై దాడులు జరిపే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే మరిన్ని డివిజన్, సర్కిళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదించినట్లు తెలిసింది. అలాగే చెక్‌పోస్టులను కూడా 2 నెలల్లోనే ఆధునీకరించాలని భావిస్తోంది.
ఈ మేరకు ఉన్నతస్థాయిలో ఆమో దం లభించినట్లు సమాచారం. సంస్కరణల విషయమై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మూలాధారమైన వాణిజ్యపన్నుల శాఖ రెవెన్యూ పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.