‘విజయ’ పథంలో నడిచేనా!

Reforms evoked in Vijaya Dairy  - Sakshi

సంస్కరణలు రద్దు చేసిన విజయ డెయిరీ యాజమాన్యం

డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థకు చెల్లు.. ఏజెంట్ల వ్యవస్థ పునరుద్ధరణ

పాల విక్రయాల పెంపునకు కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌లోని 1,650 మంది ఏజెంట్లకు ఊరట

సాక్షి, హైదరాబాద్‌: విజయ డెయిరీలో ఏడాదిగా అమలు చేస్తున్న పలు సంస్కరణలను రద్దు చేస్తూ యాజమాన్యం సంచలన నిర్ణ యం తీసుకుంది. విజయ డెయిరీ ఎండీగా 10 రోజుల క్రితం బాధ్యతలు తీసుకున్న శ్రీనివాసరావు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పాల విక్రయాలు పడిపోవడానికి ప్రధాన కారణమైన డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను రద్దు చేశారు. దానిస్థానంలో 40 ఏళ్లు ఉనికిలో ఉన్న ఏజెంట్ల వ్యవస్థను పునరుద్ధరించారు. హైదరాబాద్‌లో 1,650 మంది ఏజెంట్లు ఉన్నారు. తాజా నిర్ణయంతో వారంతా తిరిగి డెయిరీలో భాగస్వామ్యం కానున్నారు. దీంతో విజయ డెయిరీకి పూర్వ వైభవం వస్తుందని డెయిరీ వర్గాలు భావిస్తున్నాయి.

మార్కెట్లో విజయ పాల విక్రయాలు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఏడాది క్రితం పాల విక్రయాలు 4 లక్షల లీటర్లుండగా, ఇప్పుడు రెండున్నర లక్షల లీటర్లకు పడిపోయాయి. దీంతో సంస్థ టర్నోవర్‌లో రూ.240 కోట్లు తగ్గిందని డెయిరీ వర్గాలు వెల్లడించాయి. 4 లక్షల లీటర్ల నుంచి 6 లక్షల లీటర్లకు పాల విక్రయాలు పెంచుతామంటూ గతేడాది అనేక సంస్కరణలకు తెరలేపిన సంస్థ చివరకు ఉన్న విక్రయాలనే కాపాడుకోలేని దుస్థితికి చేరింది. రాన్రాను డెయిరీని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేలా కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాలు వచ్చాయి.  

ఏజెంట్ల వ్యవస్థ రద్దుతో తిరోగమన బాట  
ఏడాది క్రితం వరకు విజయ డెయిరీ నుంచి వినియోగదారులకు పాలను ఏజెంట్లే చేరవేసేవారు. వారే వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేసి డెయిరీకి చెల్లించేది. రాష్ట్రంలో విజయ డెయిరీకి పూర్తిస్థాయిలో హైదరాబాద్‌లోనే పాల విక్రయాలు జరుగుతుంటాయి. నగరంలో 1,650 మంది ఏజెంట్లు పాలను సరఫరా చేస్తుండేవారు.

కానీ డెయిరీ యంత్రాంగం వెనుకాముందు ఆలోచించకుండా ఈ ఏజెంట్ల వ్యవస్థను గతేడాది రద్దు చేసింది. వారి స్థానే సుమారు 150 మందితో డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను నెలకొల్పింది. ఏజెంట్ల వ్యవస్థను పర్యవేక్షించడం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడం కోసం నగరంలో 18 జోన్‌ కార్యాలయాలుండగా.. వాటినీ రద్దు చేశారు. పూర్తిగా డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లోనే పాల విక్రయాలు ఆధారపడేలా చేశారు. అయితే ఈ నిర్ణయంతో మెరుగవుతుందనుకున్న పరిస్థితి మరింత దిగజారింది.  

ఓ వైపు ఏజెంట్లు.. మరోవైపు ఉద్యోగులు  
గతంలో ఏజెంటు కమీషన్‌ లీటరుకు రూ.2.50 ఇచ్చేవారు. రవాణాకు అయ్యే ఖర్చుకు డెయిరీ 70 పైసలు చెల్లించేది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్‌ ఏకంగా రూ.3.90కు పెంచేశారు. రవాణా ఖర్చు 70 పైసలు ఇస్తున్నారు. పైగా డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థకు ఎలాంటి అనుభవం లేదు.

రాజకీయ అండదండలున్న వారికి డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఇప్పటివరకు ఏజెంట్లుగా పనిచేసిన వారంతా ఆందోళనలు చేశారు. ఉద్యోగులు కూడా సహాయ నిరాకరణకు దిగే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొత్త ఎండీ శ్రీనివాసరావు పాత సంస్కరణలకు చరమగీతం పాడారు. మరోవైపు ప్రైవేటు డెయిరీల నుంచి ఐదు వేల లీటర్ల పాలను విజయ డెయిరీ యాజమాన్యం తీసుకోవడానికి నిరాకరించింది. నాణ్యత లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top