‘బిల్ట్‌’లో ఉత్పత్తిని పున:ప్రారంభించాలి

Rebuild product in 'Built' - Sakshi

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

సాక్షి, హైదరాబాద్‌: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, బల్లాపూర్‌ ఇండస్ట్రీస్‌(బిల్ట్‌)లో ఉత్పత్తిని పున:ప్రారంభించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయనకు లేఖ రాశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కమలాపురంలో రేయాన్స్‌ పల్ప్‌ ఉత్పత్తి కోసం ఏపీ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ద్వారా ఏపీ రేయాన్స్‌ సంస్థ 1975లో ప్రారంభమైందని, 1981లో ఉత్పత్తి ప్రారంభించిందని తమ్మినేని తెలిపారు.

విదేశాల నుంచి పల్పును దిగుమతి చేసుకోవడంతో ఇక్కడి నుంచి పల్పు అమ్మకాలు నిలిచిపోయాయని, 2014 ఏప్రిల్‌ నుంచి కొనుగోళ్లు నిలిపివేశారన్నారు. దీంతో ఈ పరిశ్రమపై ఆధారపడిన 2 వేల మంది కార్మికులు, పరోక్షంగా మరో పది వేల మంది ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ సంస్థను పున:ప్రారంభిస్తామని, రూ.30కోట్ల సబ్సిడీ ఇస్తామని 2015లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. ఇప్పటికే వీరిలో 13 మంది చనిపోగా, ఇటీవల ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. కార్మికుల దయనీయ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top