రేషన్.. కోత! | Ration goods being supplied to the district is heavily cuts | Sakshi
Sakshi News home page

రేషన్.. కోత!

Sep 5 2014 2:57 AM | Updated on Mar 22 2019 2:57 PM

రేషన్.. కోత! - Sakshi

రేషన్.. కోత!

జిల్లాకు సరఫరా అవుతున్న రేషన్ సరుకుల్లో భారీగా కోత విధించారు.

- జిల్లాకు 93,594 క్వింటాళ్ల బియ్యం తగ్గింపు
 - ప్రభుత్వానికి తగ్గిన 25.27 కోట్ల భారం
 - ఆధార్ కార్డులివ్వని వారంతా బోగస్ కింద లెక్కింపు
 పాలమూరు : జిల్లాకు సరఫరా అవుతున్న రేషన్ సరుకుల్లో భారీగా కోత విధించారు. రేషన్ సరుకులు తీసుకోవాలంటే కార్డుదారులు ఆధార్ కార్డు ఇవ్వాల్సిందేనని నిబంధన విధించారు. దీంతో కొందరు ఆధార్ కార్డులు సమర్పించారు. ఇంకా చాలామంది వాటిని అందించలేదు. ఆధార్ కార్డులివ్వని వారంతా బోగస్ కిందే ప్రభుత్వం లెక్కగట్టింది. దీంతో వారికి ఇవ్వాల్సిన కోటాకు కత్తెర పెట్టింది. కుటుంబాల సంఖ్యతో పోలిస్తే రేషన్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉందనే విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, బోగస్ కార్డుల ఏరివేత చేపట్టిన విషయం విధితమే.. అందులో భాగంగానే  జిల్లాలో 57,412 బోగస్ కార్డులను గుర్తించింది. వాటికి అందజేయాల్సిన రేషన్ బియ్యం కోటాలో కోత విధించారు.

జిల్లాకు ప్రతినెల 18,256 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. కార్డుల ఏరివేతతో మొత్తం కోటాలోంచి సెప్టెంబర్ నెలకు గాను 93,594 క్వింటాళ్ల బియ్యాన్ని తగ్గించారు. దీంతో ప్రభుత్వానికి 25.27 కోట్ల భారం తగ్గింది. జిల్లాలో 57,412 కార్డులు తొలగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు మూడు విడతలుగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి తాత్కాలిక కూపన్లు పంపిణీ చేశారు.

ప్రతి మూడు నెలలకోసారి కూపన్లు పంపిణీ చేస్తూ వచ్చారు. కుటుంబ సభ్యుల ఫొటోతోపాటు ఆధార్ కార్డు నెంబర్లు ఇచ్చిన వారికి కార్డులు తయారు చేసి ఇచ్చారు. అయినా ఫొటోలు ఆధార్ నంబర్లు ఇవ్వని వారి సంఖ్య 69,218కు చేరుకుంది. ఈ కూపన్లకు సంబంధించి ఆధార్ నంబర్లు, ఫొటోలు సమర్పించాల్సి ఉంది. వీరికి నేడు సాయంత్రం వరకు గడువు విధించారు.
 
జిల్లాపై నెలకు తగ్గిన 25.27 కోట్ల భారం

బోగస్ కార్డుల ఏరివేతతో ప్రభుత్వానికి కాస్త ఉపశమనం కలుగుతోంది. ఎఫ్‌సీఐ నుంచి క్వింటాలు బియ్యాన్ని 2,800 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. 2,700 చొప్పున సబ్సిడీ భారం మోస్తూ.. 100కు క్వింటాలు చొప్పున పేదలకు చౌకడిపోల ద్వారా పంపిణీ చేస్తోంది. బోగస్ యూనిట్ల తొలగింపుతో నెలకు 93,594 క్వింటాళ్ల కోటా తగ్గుతోంది. క్వింటాలుకు 2,700 చొప్పున నెలకు 25.27 కోట్లు ప్రభుత్వానికి భారం తగ్గుతోంది.
 
సమాచారం నమోదుకు నేడు ఆఖరు
జిల్లా వ్యాప్తంగా 69,218 కూపన్లకు సంబంధించి ఫొటో, ఆధార్ కార్డు నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంది. వీరిలో అందరూ అనర్హులున్నారని భావించే పరిస్థితి లేదు. కొందరు అర్హులు కూడా ఉంటారు. పెపైచ్చు ఆహార భద్రత చట్టం ప్రకారం బియ్యం సరఫరా చేయకుండా ఎవరినీ వేధించే హక్కులేదు. దీంతో కూపన్ల బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తుది గడువు ఇచ్చింది. శుక్రవారం లోపు కుటుంబ సభ్యులతో కూడిన ఫొటో, ఆధార్ కార్డు నెంబర్లను సంబంధిత తహశీల్దారుకు సమర్పించాలి. వారు నిజంగా అర్హులైతే లెక్కలోకి తీసుకుని వచ్చే నెల నుంచి బియ్యం పంపిణీ చేస్తారని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి సయ్యద్ యాసిన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement