‘హద్దు’ల్లేని అక్రమం | ration card production not supplying for public | Sakshi
Sakshi News home page

‘హద్దు’ల్లేని అక్రమం

May 8 2014 3:43 AM | Updated on Oct 8 2018 5:04 PM

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన బియ్యంతో పాటు నాణ్యత కలిగిన ముడి బియ్యం జిల్లా నుంచి రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది.

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన బియ్యంతో పాటు నాణ్యత కలిగిన ముడి బియ్యం జిల్లా నుంచి రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. జిల్లాకు చెందిన కొందరు అక్రమార్కులు బియ్యం రవాణా కుంభకోణంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. బియ్యం అక్రమ రవాణా నిరోధించాల్సిన పౌర సరఫరాల శాఖ అధికారుల సహకారంతోనే ఈ తతంగం జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల ఐదో తేదీన మెదక్ జిల్లా నాగులపల్లి రైల్వే కంటెయినర్ టెర్మినల్‌లో పట్టుబడిన బియ్యం వెనుక భారీ కుంభకోణం దాగి వున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం భావిస్తోంది.
 
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : బియ్యం అక్రమ రవాణాకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంగా ముడి బియ్యం రాష్ట్ర స రిహద్దులు దాటుతోంది. రోడ్డు మార్గంపై నిఘా ఉంటుందనే ఉద్దేశంతో అక్రమార్కులు రూటు మార్చి ఏకంగా రైలు మార్గాన్నే తమ రవాణాకు రాచమార్గంగా ఎన్నుకున్నారు. పౌర సరఫరాల శాఖ నుంచి ఎలాంటి పర్మిట్లు లేకుండానే ముడి బియ్యాన్ని లారీల ద్వారా మెదక్ జిల్లా నాగుల పల్లి రైల్వే టెర్మినల్‌కు తరలిస్తున్నారు. వ్యాగన్లు బుక్ చేసుకుని మరీ అక్రమంగా తరలించిన బి య్యాన్ని ఉత్తర, ఈశాన్య భారత దేశంలోని ప లు రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు.
 
 అమన్‌గల్ కు చెందిన శ్రీ పరమేశ్వరి ట్రేడర్స్ పేరిట మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు బియ్యం రవాణా చేస్తూ పట్టుబడటంతో ఈ అక్రమ వ్యవహారం వెలుగు చూసింది. ఫుడ్ గ్రెయిన్స్ లెసైన్సును అడ్డుపెట్టుకుని అక్ర మ రవాణాకు తెరలేపారు. ఇదే రీతిలో గతంలోనూ వేలాది క్వింటాళ్ల బియ్యం ఇతర రాష్ట్రాలకు అక్రమార్కులు తరలిం చినట్లు రైల్వే రికార్డుల్లో బయట పడిన ట్లు విశ్వసనీయ సమాచారం. ప్లాస్టిక్ సంచుల్లో బియ్యాన్ని ప్యాక్ చేసి ఎవరికీ అనుమానం రాకుండా వ్యాగన్ల ద్వారా తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఇందులో ము డి బియ్యంతో పాటు ప్రజా పంపిణీ వ్య వస్త ద్వారా పేదలకు చేరాల్సిన సబ్సిడీ బియ్యం కూడా వున్నట్లు విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు. పీడీఎస్ బియ్యాన్ని గుర్తించే బాధ్యతను పటాన్‌చెరు సహాయ పౌర సరఫరాల శాఖ అధికారికి అప్పగించారు. పంచనామా పూర్తి చేసిన ఎఎస్‌ఓ మోహన్‌బాబు త్వరలో మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నారు.
 
 పర్మిట్లు లేకుండానే రవాణా
 ఒక జిల్లా నుంచి మరో జిల్లా లేదా ఇతర రాష్ట్రాలకు ముడి బియ్యాన్ని రవాణా చేయాలంటే జిల్లా పౌర సరఫరాల అధికారి (డీఎస్‌ఓ) పర్మిట్ జారీ చేయాల్సి ఉంటుంది. ధరల నియంత్రణలో భాగంగా మూడేళ్లుగా ముడి బియ్యం పర్మిట్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా అప్పుడప్పుడూ పర్మిట్ల జారీకి సడలింపు ఇస్తున్నారు. నాగులపల్లి టెర్మినల్ వద్ద పట్టుబడిన బియ్యానికి ఎలాంటి పర్మిట్లు లేవు.
 
 అనూహ్యంగా విజిలెన్స్ విభాగానికి చిక్కడంతో అక్రమార్కులు కొత్త ఎత్తులకు తెరలేపినట్లు తెలుస్తోంది. బియ్యంతో సహా లారీలను స్వాధీనం చేసుకోవాల్సిన అధికారులు కేవలం బియ్యాన్ని మాత్రమే పటాన్‌చెరులోని ఓ ప్రైవేటు రైసు మిల్లులో డంప్ చేసి లారీలను వదిలేశారు. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పౌర సరఫరాల అధికారుల సాయంతో అక్రమార్కులు హడావుడిగా పర్మిట్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
 
 ఈ ఏడాది జనవరి 22 నుంచి పౌర సరఫరాల కమిషనర్ పర్మిట్ల జారీపై పాక్షిక సడలింపు ఇవ్వడంతో జిల్లా అధికారులు కూడా దొడ్డిదారిన హడావుడిగా పర్మిట్లు జారీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. విజిలెన్స్ కేసు నమోదై మూడు రోజులు కావస్తున్నా పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులు తమకు సమాచారం లేదనే నెపంతో బియ్యం అక్రమ రవాణా వ్యవహారాన్ని తొక్కి పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నాగులపల్లి రైల్వే టెర్మినల్ ద్వారా ఇటీవలి కాలంలో రవాణా అయిన బియ్యం వివరాలు వెలికి తీస్తే భారీ కుంభకోణం వెలుగు చూసే అవకాశం వుంది.
 
 అక్రమ రవాణా నిజమే !
  నిత్యావసరాల చట్టంలోని సెక్షన్ 6ఎ కింద కేసు నమోదు చేశాం. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు భావిస్తున్నాం. - సత్యన్న, ఇన్‌స్పెక్టర్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, మెదక్ జిల్లా
  శ్రీ పరమేశ్వరి ట్రేడర్స్‌కు బియ్యం రవాణాకు ఎలాంటి పర్మిట్ ఇవ్వలేదు. ఎఫ్‌జీఎల్‌ను అడ్డుపెట్టుకుని ఈ అక్రమానికి పాల్పడి వుంటారు. - సురేశ్, డిప్యూటీ తహశీల్దార్ (సివిల్ సప్లైస్), అమన్‌గల్
 కేసు నమోదైంది ఇలా!
 మెదక్ జిల్లా నాగులపల్లిలోని కంటెయినర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన డొమెస్టిక్ కంటెయినర్ టెర్మినల్ వద్ద ఈ నెల ఐదో తేదీన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రెండు లారీలు స్వాధీనం చేసుకున్నారు. లారీ నంబరు ఏపీ 29 యు 3381లో రూ.4,89,500 విలువ చేసే 220 క్వింటాళ్ల బియ్యం, మరో లారీ నంబరు ఏపీ 11 టీ 3978, రూ.2,67,000 విలువ చేసే 120 క్వింటాళ్ల బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నట్లు తేలింది. అమన్‌గల్‌కు చెందిన శ్రీ పరమేశ్వరి ట్రేడర్స్ సరైన అనుమతి పత్రాలు లేకుండా రైల్వే వాగన్ల ద్వారా మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం రూ.7,56,500 విలువ చేసే బియ్యంతో కూడిన రెండు లారీలను మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామలోని ఓ ప్రైవేటు రైసు మిల్లుకు తరలించారు. నిత్యావసరాల చట్టంలోని సెక్షన్ 6ఎ కింద కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement